పోలీసు పోలీసు... నో పోలీసు

పోలీసు పోలీసు... నో పోలీసు - Sakshi


హైదరాబాద్ నగర పోలీసులు అంతర్జాతీయ ఖ్యాతీ నార్జించాలి.... హైదరాబాద్‌ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలి ... తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలి... మూడు నెలల్లో అన్ని ప్రాంతాలలో అత్యాధునిక సీసీ కెమెరాలు.... గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమం (ఆగస్టు 14)లో భాగంగా మొదటి విడతలో 100 ఇన్నోవాలు, 300 బైక్లను పోలీసు శాఖకు అందజేస్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాటలివి. 100 ఇన్నోవాలు, 300 బైకులపై పోలీసులు నిరంతరం గస్తీతో తమకిక గుండెలమీద చేయి వేసుకుని పడుకోవచ్చనుకున్నారు నగరవాసులు. అయితే ప్రజల నమ్మకాన్ని ఖాకీలు మరోసారి వమ్ము చేశారు.



సీనియర్ నటి శ్రీలక్ష్మి గొలుసు చోరీ ఉదంతమే పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అంత పోలీసుల గస్తీలోను, కెమెరాల పహారాలోను ఆమె మెడలోని బంగారపు గొలుసును దుండగులు తెంపుకుని పోయారు. ఆ ఘటన నుంచి తేరుకునే లోపే దుండగులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన అప్పటికే వారు మామమైయ్యారు. శ్రీలక్ష్మి షాక్ నుంచి తెరుకుని పోలీస్, పోలీస్ అని పిలిచినా పలికే నాధుడే లేడు.  పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కోసం 100 డయల్ చేసినా అటువైపు నుంచి స్పందన శూన్యం. చేసేదీలేక ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ దాకా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.



తెలంగాణ ప్రభుత్వం ఇంత అట్టహాసంగా పెట్రోలింగ్ కోసం అంటూ వందల ఇన్నోవా... వందల బైకులు తీసుకువచ్చినా పోలీసులు స్పందనలో మార్పులేకపోవడం శోచనీయం.అదికాక ఇన్నోవా డ్రైవర్లు, నిర్వహణదారులకు ఏపీ పోలీసు అకాడమితోపాటు అడ్మినిష్ట్రేన్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ఆ వాహనాల్లో ఏసీ, జీపీఎస్ సిస్టమ్, ట్యాబెట్లు పీసీలు, కెమెరాలు, వీహెచ్ఎఫ్ సెట్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇన్ని చేసినా స్పందనారాహిత్యంతో పోలీసు వ్యవస్థ అభాసుపాలవుతోంది.హైదరాబాద్ మహానగరంలో గొలుసు చోరీలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూన్నారు. కానీ ఆ కేసుల్లో మాత్రం పురోగతి ఎండమావిని తలపిస్తోంది. రక్షక భటులు ఇకనైనా మేల్కోపోతే సామాన్యులకు తిప్పలు తప్పవు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top