‘పాలమూరు’ పనులకు పునాదిరాయి!

‘పాలమూరు’ పనులకు పునాదిరాయి! - Sakshi


సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా సాగు అవసరాలను తీర్చుతూ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఆయకట్టుకు సాగు సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథక పనులకు నేడు పునాదిరాయి పడనుంది. మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న పథకం పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా 18 ప్యాకేజీలుగా విభజించిన ప్రాజెక్టులోని ఆరు ప్యాకేజీల పనులు శుక్రవారం మొదలు కానున్నాయి.



నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్‌ల పరిధిలోని పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ  మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు జిల్లా మంత్రు లు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.15 గంటలకు గోపాల్‌పేట మండలం ఏదుల వద్ద రిజర్వాయర్ పనులను ప్రారంభించి, సభలో మాట్లాడతారు.   

 

12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూ. 35,200 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని, వరద జలాలను తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లోని 37 మండలాల్లో కరువు కోరల్లో చిక్కుకున్న 718 గ్రామాల్లోని 7లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 7 నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని 400 గ్రామాల్లో ఉన్న 5లక్షల ఎకరాలు, నల్లగొండలోని 2 నియోజకవర్గాల్లోని 5 మండలాల్లోని 13 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు.



దీనికోసం మొత్తంగా 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్ (8.61 టీఎంసీ), ఏదుల (6.55 టీఎంసీ), వట్టెం (16.58 టీఎంసీ), కరివెన (19.15 టీఎంసీ), ఉద్దండాపూర్ (15.91 టీఎంసీ), కేపీ లక్ష్మీదేవునిపల్లి (2.80 టీఎంసీ)ల సామర్థ్యాలతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని 5 రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, రూ. 30వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు.

 

సమాంతరంగా అన్ని పనులు

పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు నిర్ణీత కాలవ్యవధి పెట్టుకొని పనులన్నింటినీ ఏకకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు  ఇప్పటికే 9 వేల ఎకరాల సేకరణ పూర్తయింది. మిగతా సేకరణను త్వరగా పూర్తి చేసి ఏజెన్సీలకు సహకరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా 8 లక్షల ఎకరాలు, నిర్మాణంలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా మరో 7లక్షల ఎకరాలకు నీరందించి, జిల్లాను కరువు నుంచి విముక్తి చేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top