అడుగు ముందుకు..


గద్వాల : గద్వాల మండలంలోని గుర్రంగడ్డ దీవికి రాకపోకలు సాగిం చేందుకు కృష్ణానదిపై నిర్మించనున్న బ్రిడ్జి డిజైన్‌కు అడ్డంకులు తొలగనున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి డిజైన్స్ విభాగంలో పెండింగ్‌లో ఉన్న ఈఫైల్ అక్కడ ఆమోదం పొందినట్లు తెలిసింది. మరో మూడురోజుల్లో ఈఎన్‌సీకి చేరి అక్కడి నుంచి జూరాల ఇంజనీర్లకు అందనుంది. నివేదిక రాగానే డీపీఆర్(డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పనులను ప్రారంభించనున్నారు.



నాలుగేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణ ం విషయంలో ఎట్టకేలకు స్పందించిన అధికారులు డిజైన్‌లో మార్పులు చేసి సింగిల్‌లైన్ బ్రిడ్జిగా ప్రతిపాదించారు. త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది. గుర్రంగడ్డ దీవి ప్రజలకు రవాణా కల్పించాలనే లక్ష్యం తో 2009 జనవరిలో రోప్‌వే బ్రిడ్జికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఏడాది క్రితం రోప్‌వే బ్రిడ్జి కాకుండా కాజ్‌వే బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వేలు చేశారు.



చివరకు మూడో ప్రతిపాదనగా నదిలో పిల్లర్స్‌ను ఏర్పాటు చేసి సింగిల్‌లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి తుదిరూపు ఇచ్చారు. ఇలా మూడో ప్రతిపాదనతో ప్రాథమిక డిజైన్‌ను తయారుచేసి హైదరాబాద్‌లోని డిజైన్స్ విభాగానికి ఫైల్‌ను 2013 సెప్టెంబర్‌లో పంపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది. మరో రెండు రోజుల్లో డిజైన్స్ నుంచి గుర్రంగడ్డ ఫైల్‌ను పంపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తెలంగాణ ప్రభుత్వం డిటెయిల్డ్ సర్వేకు అనుమతి ఇస్తే పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.



 బ్రిడ్జీ ఏర్పాటుతో రవాణా సౌకర్యం...

 నది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ దీవి గ్రామానికి సింగిల్‌లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బయటి ప్రాంతాలతో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఇప్పటి వరకు ఎటువెళ్లి రావాలన్నా పుట్టీలను ఆశ్రయించిన ఆ గ్రామస్తులు ఇకపై ఎద్దుల బండ్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లను వినియోగించే అవకాశం ఉంటుంది. సింగిల్ లైన్ బ్రిడ్జి నిర్మిస్తే బ్రిడ్జికి అవతలి వైపున ఒక వాహనం ప్రవేశిస్తే ఆ వాహనం బ్రిడ్జి దాటే వరకు ఎదురుగా మరో వాహనం వెళ్లే అవకాశం ఉండదు. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 పంట ఉత్పత్తుల అమ్మకానికి మంచి రోజులు

 కృష్ణానది మధ్యలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గుర్రంగడ్డ దీవి 2100ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ దాదాపు 150 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కృష్ణానది నీటిని పొలాలకు తరలించి 850ఎకరాల్లో మాగాణి పంటలను పండిస్తున్నారు. దిగుబడిని బయటి ప్రాంతాలకు తరలించలేక వేసవి వరకు ఎదురుచూస్తున్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు నది నిండుగా ప్రవహించడం వల్ల మార్చిలో నది రెండవ పాయలో నీటి ఉధృతి తగ్గాక ట్రాక్టర్లలో పంట ఉత్పత్తులను పెబ్బేరు వైపు ఉన్న దారిలో గద్వాల, ఇతర ప్రాంతాల వ్యవసాయ మార్కెట్లకు తరలించి అమ్ముకుంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top