కుట్రతోనే ‘సిర్పూర్‌’ మిల్లు మూత

కుట్రతోనే ‘సిర్పూర్‌’ మిల్లు మూత


ఇది అదనపు రాయితీలు పొందే రహస్య ఎజెండా: కేటీఆర్‌

పునరుద్ధరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరణ

‘ఉదయ్‌’తో నేరుగా రాష్ట్రానికి వచ్చేదేమీ లేదు: జగదీశ్‌రెడ్డి

♦  మితిమీరిన వేగంపై 25 వేల కేసులు: మహేందర్‌రెడ్డి




సాక్షి, హైదరాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మూత పడటం వెనుక యాజమాన్య కుట్ర దాగున్నట్లుగా భావిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అదనపు రాయితీలు పొందే రహస్య ఎజెండా యాజమాన్యానికి ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపారు. శనివారం శాసనసభలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లుపై కాంగ్రెస్‌ సభ్యులు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ సభ్యుడు దుర్గం చిన్నయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే మిల్లు మూతపడే పరిస్థితిలో ఉందని, ఏర్పాటు తర్వాత మూడు నెలలకే మూసేశారని కేటీఆర్‌ తెలిపారు. దీనిపై యాజమాన్యంతో అనేకమార్లు చర్చించామని, అయితే వారి కోరికలు అనంతంగా ఉన్నాయని, భవిష్యత్‌ ప్రణాళిక సరిగా లేదని చెప్పారు.


పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని కోరినా మిల్లు యాజమాన్యం నుంచి స్పందన లేదని వెల్లడించారు. మిల్లు మూతపడే సమాచారం రాగానే పవర్‌ సబ్సిడీ కింద రూ.5 కోట్లు ఇచ్చామని, తర్వాతి ఏడాదిలో మరో రూ.2.19 కోట్ల సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. మిల్లును తిరిగే తెరిపించే దిశలో ఐటీసీ, జేకే పేపర్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపామని చెప్పారు. రామగుండం ఎఫ్‌సీఐ, ఆదిలాబాద్‌లోని సీసీఐ, వరంగల్‌లోని బిల్ట్‌ సంస్థలు మూతపడితే తెరిపించామని, సిర్పూర్‌ మిల్లును తెరిపించే ప్రయత్నం చేస్తామన్నారు. మిల్లు తెరిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేస్తున్న కృషినిసభ్యులు కొనియాడారు.



రవాణా శాఖలో అంతా ఆన్‌లైన్‌

రవాణా శాఖలో అన్ని అనుమతుల జారీని ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో వాహన కాలుష్య ధ్రువీకరణ జారీకి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2008లో ప్రారంభించిన ఆన్‌లైన్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నేడు 57 సేవలకు విస్తరించిందని, ఇప్పటిరవకు 6.41 లక్షల లర్నింగ్, 6.13 లక్షల డ్రైవింగ్‌ లైసెన్సులు, 10.59 లక్షల రిజిస్ట్రేషన్లు, 2.48 లక్షల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందించామని వివరించారు. వేగ నియంత్రణకు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, మితిమీరిన వేగానికి సంబంధించి ఆర్టీఏ అధికారులు 25 వేల కేసులు నమోదు చేశారని వెల్లడించారు.


టీఆర్‌ఎస్‌ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌ కుమార్, జలగం వెంకట్రావు, కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలకు వేగ నియంత్రణ తప్పనిసరి చేశామని చెప్పారు. మరోవైపు పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులను పెంచాలని టీఆర్‌ఎస్‌ సభ్యులు గొంగిడి సునీత, ఏనుగు రవీందర్‌రెడ్డి కోరారు. దీనికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, సభ్యుల వినతిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.



‘ఉదయ్‌’తో ప్రత్యేక ప్రయోజనం లేదు

కేంద్రం తెచ్చిన ఉదయ్‌ పథకంతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ‘కొన్ని రాష్ట్రాల్లో డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. దీంతో ఉదయ్‌ పథకంలో చేరిన రాష్ట్రాలకు కేంద్రం బాండ్లు అందజేసింది. మార్కెట్లో పెట్టిన గంటలోపే తెలంగాణ బాండ్ల విక్రయాలు జరిగాయి’ అని వెల్లడించారు. సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, వేముల వీరేశం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తంగా రూ.1,350 కోట్ల సాయం అందగా, అందులో రూ.810 కోట్లు గ్రాంట్ల రూపంలోనే అందినట్లు చెప్పారు. ఉదయ్‌ పథకంలో చేరినందున 20 శాతం గ్రాంటు ఇవ్వాలని కోరినా కేంద్రం సాధ్యం కాదని చెప్పిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top