నిధులొచ్చేనా ?


సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లలో జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లోనైనా జిల్లాకు పెద్దపీట వేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు సీమాంధ్ర పాలకులు      శీతకన్ను వేయడం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని పదేపదే ప్రస్తావించిన టీఆర్‌ఎస్... ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఎలాంటి హామీలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు వేసవి సమీపిస్తుండడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.

 

  కరువు, కరెంటు కోతలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధుల స్పందన కీలకం కానుంది. సాగు కలిసి రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు పరిహారం చెల్లింపుపై ప్రకటన కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ, రోడ్ల మరమ్మతు వంటి భారీ ప్రణాళికలు ఓ వైపు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పాలమూరు ఎత్తిపోతలకు సీఎం కే సీఆర్ ఇప్పటివరకు శంకుస్థాపన చేయకపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు.

 

 వలసలకు చెక్ పెట్టేనా?

 ‘బంగారు తెలంగాణ’ సాధనలో తొలిమెట్టుగా భావించిన గతేడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ తొలి బడ్జెట్ పాలమూరు జిల్లాకు పాక్షిక ప్రాధాన్యతే దక్కింది. పదినెలల కాలానికి గాను ప్రవేశపెట్టిన అప్పటి బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక పాధాన్యతనేది ఏమీ లభించలేదు. ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో వలసలకు చెక్ పెట్టేలా ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

 ప్రస్తుతం జిల్లాలో ఉపాధిహామీ అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో ఉపాధిహామీ కింద మొత్తం 8,79,534 కుటుంబాలు జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. ఈ పథకం కింద 4,80,420 మంది కూలీలు పనిచేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం రెండు లక్షల మందికి కూడా పనులు కల్పించలేకపోతున్నారు. దీంతో వలసలు తీవ్రమయ్యాయి. మరోవైపు సరైన వర్షాలు లేక జిల్లాలో కరువు తాండవిస్తోంది. భూగర్భజలాలు పడిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. ఫలితంగా రబీ సాగు సగానికి పైగా పడిపోయింది. ఫలితంగా ఏడాదిలో దాదాపు 76 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వీరికి ఇప్పటి దాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.

 

 ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా..!

 రాష్ట్రంలోనే నాలుగు భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా వీటి నిర్మాణం పూర్తవడం లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ నాటికి కచ్చితంగా నీరందించాలని కృతనిశ్చయంతో ఉంది. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పనులను ఏడాది లోగా పూర్తిచేసి 2.97 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిమంత్రి ఈటెల రాజేందర్ గత బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కానీ ప్రతిపాదనల్లో మాత్రం కోత విధించారు. జిల్లాలోని ఆరు ప్రాజెక్టులకు రూ.443 కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదించారు.

 

 ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కేవలం కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు మాత్రమే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. ఆర్డీఎస్ ఆధునికీకరణ ఊసు లేకుండా కేవలం వేతనాలకు సరిపోయే నిధులను మాత్రమే గత బడ్జెట్‌లో కేటాయించారు. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు శంకుస్థాపన చేయలేకపోయింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top