గతంలోనూ హత్యల చరిత్రేనా?

గతంలోనూ హత్యల చరిత్రేనా?


నరేష్ హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అతడిని చంపిన శ్రీనివాసరెడ్డికి 20 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ముందు నుంచే రౌడీషీటర్లతో తిరిగేవాడని అంటున్నారు. గతంలో 1992 సంవత్సరంలో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు సైతం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అప్పట్లో ఈ మూడు హత్యల విషయంలోనూ ఈయనపై అనుమానాలు తలెత్తాయి గానీ, ఆధారాలు ఏమీ లేకపోవడంతో రుజువు కాలేదు. ఇప్పుడు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ అనుమానాస్పద మృతి, నరేష్ హత్య కేసులలో కూడా దాదాపు ఇలాగే జరిగేది. అయితే కోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ వేగవంతం చేయడంతో మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చింది. హత్య జరిగిన తీరు మొత్తం బట్టబయలైంది.



స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే ఆమె భర్త నరేష్‌ను దారుణంగా చంపి, టైర్లతో తగలబెట్టిన శ్రీనివాసరెడ్డి.. అతడి అస్థికలను మూసీనదిలో కలిపేశాడు. దాంతో అసలు ఆధారాలన్నవి దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే పోలీసులు చుట్టుపక్కల విచారించడంతో పాటు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా హత్య లాంటి నేరాలు చేస్తే ఎక్కడో ఒకచోట ఆధారాలు వదలకుండా ఉండారు. కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం పక్కాగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా చేసి చివరకు అస్థికలను కూడా మూసీనదిలో కలిపేయడంతో.. స్వయంగా ఆయన చెబితే తప్ప హత్య జరిగిందన్న విషయం కూడా బయటకు వచ్చేది కాదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top