హెచ్‌సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి

హెచ్‌సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి - Sakshi

  • హెచ్‌సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి

  •   అధ్యక్ష బరిలో వినోద్, అర్షద్

  •   ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

  •   ప్రారంభమైన ప్రచారం

  •   అప్పుడే మొదలైన ప్రలోభాల పర్వం

  • సాక్షి, సిటీబ్యూరో:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు గడ్డం వినోద్, అర్షద్ అయూబ్‌ల ప్యానెళ్లు ఎన్నికల సంగ్రామంలో నిలిచాయి. ఈ రెండు ప్యానెళ్ల వారు సమరానికి సై అంటున్నారు. అప్పుడే ప్రచారాన్ని మొదలు పెట్టడమే కాదు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. అంతకుముందు పలువురు సభ్యులు శిబిరాలను మారడంతో ఆయా ప్యానెళ్లను ఉత్కంఠకు గురిచేశాయి. ఓటరు జాబితాలోనూ గందరగోళం నెలకొనడంతో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

     

    2014-16 కాలానికి గాను హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7న జరిగే పోలింగ్‌లో గుర్తింపు పొందిన క్లబ్బుల సభ్యులు, అసోసియేషన్ల ప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక ల్లో అధ్యక్ష పదవి మొదలుకుని కోశాధికారి వరకు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. కార్యవర్గ సభ్యుల పోస్టులు పన్నెండుకు గాను మొత్తం 25 మంది తలపడుతున్నారు. ఆదివారం అభ్యర్థుల తుది జాబితాలు ప్రకటించటంతో ఆ రెండు ప్యానెళ్ల వారు అమీతుమీకి దిగారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు ముందు అర్షద్ శిబిరంలోని వారు వినోద్ వైపు, వినోద్ శిబిరంలోని వారు అర్షద్ శిబిరాల వైపు మారిపోవడంతో చివరి వరకు హైడ్రామా నెలకొంది. ఈ ఎన్నికలకు హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ దూరంగా ఉన్నారు.

     

    శిబిరాలుగా విడిపోయిన క్లబ్బులు..



    ఓటు హక్కు కలిగిన క్లబ్బులు రెండు విడిపోయాయి. హెచ్‌సీఏలో బల్క్ క్లబ్బు (ఒక్కరి చేతిలో ఎక్కువ క్లబ్బులు)లకు చెందిన వారు అత్యధికంగా అర్షద్ అయూబ్ ప్యానెల్‌లో వివిధ పదవులకు పోటీ పడుతుండగా, ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూళ్లు, బ్యాంకులు(ఇన్‌స్టిట్యూషన్స్)తో పాటు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న క్లబ్బుల ప్రతినిధులు వినోద్ ప్యానెల్ తరఫున వివిధ పదవుల కోసం బరిలోకి దిగారు. మొత్తం 216 క్లబ్‌లు ఉన్నాయి. ఒక్కో క్లబ్‌కు ఒక ఓటు ఉంటుంది. ఇందులో 55 మంది ఓటర్లు బల్క్‌గా, మరో 55 మంది వివిధ సంస్థలకు చెందిన వారు ఉన్నారు. కాగా మిగిలిన వారంతా వ్యక్తిగతంగా వ్యవహరించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వ్యవహరించే ఓటర్లు ఎటువైపు మొగ్గితే వారు ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి. ఆదివారం నుంచి స్వయంగా రంగంలోకి దిగిన ఇరు ప్యానెళ్ల ప్రతినిధులు.. ‘మీకేం కావాలన్నా సమకూరుస్తాం’ అంటూ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మునిగిపోయారు.

     

    ఫతేమైదాన్ క్లబ్ ఓటుపై అభ్యంతరం..

     

    మాజీ మంత్రి వినోద్ శిబిరం నుంచి హెచ్‌సీఏ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శేష్‌నారాయణ ప్రాతినిధ్యంపై ఫతేమైదాన్ క్లబ్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు కారణాలతో శేష్‌నారాయణ సభ్యత్వాన్ని సస్పెండ్ చేశామని చెబుతున్నారు. ఫతేమైదాన్ క్లబ్ నుంచి ఆయన స్థానంలో మరొకరిని ఓటరుగా అనుమతించాలని ఆ క్లబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.

     

    ఓటరు జాబితాలో వింతలెన్నో...

     

    హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఓటర్ల జాబితాలో ఎన్నో వింతలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో క్రికెట్ కోసం కృషి చేస్తున్న క్లబ్‌లకు ఇప్పటివరకు గుర్తింపు ఇవ్వకుండా కేవలం పదిమంది చేతుల్లోనే నగరంలో మెజారిటీ క్లబ్‌లు చేరిపోయాయన్న ఫిర్యాదులున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగతా ఎనిమిది జిల్లాల నుంచి కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పలు జిల్లాలకు ఓటు హక్కు ఉన్నట్టు ఓటరు జాబితా చూపుతున్నా, వాటి ప్రతినిధులుగా  రాజధానికి చెందిన వారే కావడం గమనార్హం. హెచ్‌సీఏ గుర్తింపు పొందిన క్లబ్బులు,అసోసియేషన్లే సెప్టెంబర్ 7న జరిగే ఎన్నికల్లో నూతన కమిటీ (2014-16)ని ఎన్నుకోనున్నాయి.

     

    కలకలం రేపిన ఏసీబీ నోటీసులు



    హెచ్‌సీఏ ఎన్నికలు ఓ వైపు రసవత్తరంగా మారగా మరో వైపు అవినీతి నిరోధక శాఖ సైతం తమ విచారణను ముమ్మరం చేసింది. వారం రోజుల క్రితం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి శివలాల్‌తోపాటు అప్పటి కార్యవర్గంలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణాల్లో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలపై నోటీసులు జారీ అయ్యాయి. స్టేడియం నిర్మాణ వ్యయం పెంపు, స్టేడియం రూఫ్(కనోపీ) నిర్మాణంలో నాణ్యత లేమి, మహబూబ్‌నగర్‌లో స్టేడియం కోసం అధిక ధరకు భూమిని కొనుగోలు, కార్పొరేట్ బాక్స్‌ల అమ్మకంలో కమీషన్ వ్యవహారం, కమర్షియల్ ట్యాక్స్ ఎగవేత, టెండర్లు లేకుండా పనుల అప్పగింత తదితర మొత్తం పది అంశాలపై ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపు విచారణను సైతం పూర్తి చేసింది. అప్పట్లో హెచ్‌సీఏ బాధ్యతల్లో ఉన్న అర్షద్ అయూబ్, శివలాల్, చలపతితోపాటు మొత్తం కార్యవర్గం వారం రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు.

     

     ఆయా స్థానాలకు బరిలో మిగిలింది వీరే...

     అధ్యక్షుడు (పదవి-1): జి.వినోద్, అర్షద్ అయూబ్



     ఉపాధ్యక్షులు (పదవులు-5): ఎంవీ శ్రీధర్, జి. వివేకానంద్, కిషన్ రావు, ఇ. వెంకట్రామ్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, యాదగిరి, ప్రకాశ్‌చంద్ జైన్, సురేందర్ అగర్వాల్, మొయిజుద్దీన్, శేష్ నారాయణ్.

     

     కార్యదర్శి (1): ఎస్. వెంకటేశ్వరన్, జాన్‌మనోజ్

     సంయుక్త కార్యదర్శులు (2): పురుషోత్తం అగర్వాల్, జెరార్డ్ కార్, విజయానంద్, బస్వరాజు

     

     కోశాధికారి (1): నరేశ్ శర్మ, దేవరాజ్

     

     ఈసీ సభ్యులు (12): ఛాతిరి బాబూరావు, అద్నాన్ మెహమూద్, ఫారూఖ్, అరుణ్ కుమార్, నర్సింహారెడ్డి, జగ్గూలాల్, చిట్టి శ్రీధర్, మహేంద్ర, శ్రీనివాసరావు, పి.శ్రీధర్, వాల్టర్స్, సూర్యప్రకాశ్, దల్జీత్ సింగ్, భాస్కర్, అనిల్ కుమార్, రాజన్ సింగ్, రమణ, శ్రీనివాస చక్రవర్తి, లక్ష్మీకాంత్ రాథోడ్, వంకా మహేందర్, మనోహర్‌రెడ్డి, విక్టర్ అమల్ రాజ్, జి. శ్రీనివాస రావు, విక్రమ్ మాన్‌సింగ్, శ్రీనివాస్‌రెడ్డి.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top