చివరి ఆయకట్టు వరకూ ఎస్సారెస్పీ నీరు

చివరి ఆయకట్టు వరకూ ఎస్సారెస్పీ నీరు


ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ

- కాల్వల సామర్థ్యంపై ఇంజనీర్ల సర్వే పూర్తి

- సర్కారుకు నీటిపారుదల శాఖ నివేదిక అందజేత

- 94 కి.మీల మేర నిర్మాణం, రూ.600 కోట్ల అంచనా

- ప్రభుత్వం ఆదేశిస్తే.. కొత్త కాల్వలపైనా సర్వే

- శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల వెల్లడి

 హన్మకొండ :
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాలను జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించే నివేదిక సిద్ధమైంది. గత నెలలో జరిగిన సాగునీటి శాఖ సమీక్షలో వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వల పరిస్థితి, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలివ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థారుులో నీరందించేలా కాల్వల ఆధునికీకరణకు సంబంధించి పరిశీలనలు చేపట్టాలని సూచించారు. ఎస్సారెస్పీ జలాలతో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా కొత్త కాల్వల నిర్మాణం కోసం సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు జిల్లాలో కాల్వల ఆధునికీకరణపై సర్వే చేపట్టారు. 16 రోజులుగా సర్వే చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

 

నివేదికలోని అంశాలు

ప్రస్తుతం ఉన్న కాల్వల నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడం, ఎస్సారెస్పీ రెండో దశకు నీరిందించాలంటే ప్రధాన కాల్వ సామర్థ్యం పెంపు తప్పనిసరి అని ఇంజనీర్లు నివేదికలో స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాల్వ సామర్థ్యాన్ని పెంచి రెండో స్టేజ్ కాల్వలకు లింకు చేయాలంటే... మొదటి విడత కాల్వల సామర్థ్యం పెంచాలని సూచించారు. కొన్ని చోట్ల టన్నెల్ కింది భాగంలో లీకులున్నాయని, వాటిని నిర్మాణ సమయంలో రాయితో నిర్మించారని, వాటిని అధునాతన పద్ధతిలో తిరిగి నిర్మాణం చేయాలని పేర్కొన్నారు.



కాకతీయ కాలువ 146 కిలోమీటర్ (జిల్లా సరిహద్దు) నుంచి 284వ కిలోమీటర్ (వర్ధన్నపేట మండలం ఇల్లంద) వరకు 94 కిలోమీటర్ల మేర సామర్థ్యం పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం కాల్వ సామర్థ్యం 8,500 క్యూసెక్కులని, దాన్ని 12,000 క్యూసెక్కులకు పెంచి, రెండో దశకు లింకు చేస్తే కాల్వ నీరు అందించవచ్చని వివరించారు. ఇప్పుడు కాల్వల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో 3,000 క్యూసెక్కుల నుంచి 3500 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నామని, ఆధునికీకరించిన తర్వాత పూర్తిస్థాయిలో ఇస్తామని ఇంజనీర్లు నివేదికలో పొందుపర్చారు.



 కాల్వల సామర్థ్యం పెంపునకు రూ. 600 కోట్లు అవసరమని లెక్కలేశారు. ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ పరిధిలోని డీబీఎం-48లో 50వ కిలోమీటర్ నుంచి 83వ కిలోమీటర్ వరకు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు నీరిందించేందుకు కాల్వలను ఆధునికీకరించాలని నివేదించారు. ఇక్కడ కూడా కాల్వల నుంచి నీరు బయటకు లీకవుతోందని, షట్టర్ల ఏర్పాటు సరిగా లేదని పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ఆధునికీకరిస్తేనే నీటిని అందించగల్గుతామని స్పష్టం చేశారు. ఇందుకు మరో రూ. 38 కోట్లు అవసరమని నివేదికల్లో పొందుపరిచినట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

 

కొత్త కాల్వల నిర్మాణంపైనా...

కాకతీయ కాల్వ నుంచి నర్సంపేట, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ఎస్సారెస్పీ నీటిని అందించాలంటే  కొత్తగా కాల్వల తవ్వకం చేపట్టాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కొత్త కాల్వలు నిర్మాణం చేసే ప్రాంతాలు, వాటి మ్యాపులను ప్రభుత్వానికి సమర్పించామని, ప్రభుత్వం సర్వేకు అనుమతిస్తే.. వెంటనే ప్రారంభిస్తామని ఎస్సారెస్పీ అధికారులు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top