నెలలో వారం పల్లెల్లోనే..

నెలలో వారం పల్లెల్లోనే.. - Sakshi


బీజేపీ పదాధికారులకు అమిత్ షా నిర్దేశం

కష్టపడే వారే బాధ్యతలు తీసుకోవాలి.. అందరి పనితీరూ పరిశీలిస్తా

ఒకప్పుడు గుజరాత్‌లో పార్టీ పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఉంది

అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి


 

సాక్షి, హైదరాబాద్: పార్టీ పదాధికారులు ఇకపై నెలలో వారం రోజులు గ్రామాల్లోనే గడపాలని, రాత్రి బస కూడా అక్కడే చేయాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్దేశించారు. నేతలెవరూ పార్టీ కార్యాలయానికే పరిమితం కావద్దని, గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడే వారినే పదాధికారులుగా ఉండాలన్నారు. అందరి పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తానని, నెలలో వారం రోజులు దక్షిణాదిలోనే ఉండి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. గురువారం రాత్రి ఆయన పంజాగుట్టలోని సెస్ ఆడిటోరియంలో పార్టీ తెలంగాణ పదాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ.. పార్టీ నేతలకు సూటిగా, స్పష్టంగా సూచనలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని అందిపుచ్చుకోవటానికి నేతలు బాగా శ్రమపడాలని పేర్కొన్నారు. 1985లో గుజరాత్‌లో పార్టీని అధికారంలోకి తేవడానికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. వెరసి గుజరాత్ నమూనాను తెలంగాణలో అమలు చేయనున్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు.

 

కొందరు నేతలు వేసిన ప్రశ్నల ఆధారంగా అమిత్ షా చేసిన కీలక సూచనలు ఇలా ఉన్నాయి.

1985లో గుజరాత్‌లో ఉన్న పరిస్థితే ఇప్పుడు తెలంగాణలో ఉంది. అప్పట్లో అక్కడ బీజేపీకి కేవలం 9 మంది ఎమ్మెల్యేలుండేవారు, తెలంగాణలో ఐదుగురున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించడాన్ని పరిశీలిస్తే 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.

 

పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున అక్కడి నుంచి నిధులు కావాలనో, రాష్ట్రానికి ప్రాజెక్టులు కావాలనో అడక్కండి. రాష్ట్రానికి, ప్రజలకు ఏం కావాలో అది ప్రభుత్వం చూసుకుంటుంది. కేంద్రంపై ఆధారపడి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనను విరమించుకోండి. అసలు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్నే మర్చిపొండి.

 

వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులుండాలా వద్దా అన్నది నేను చూసుకుంటా. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తే అసలు పొత్తుల అవసరమే ఉండదు. వాస్తవానికి నేను పొత్తు విధానానికి వ్యతిరేకిని. పార్టీని మీరు పటిష్టం చేయకపోతేనే పొత్తు ప్రస్తావన వస్తుంది.

 

ఏడాది పొడవునా పార్టీ కార్యక్రమాలు ఉండేలా కార్యాచరణను సిద్ధం చేయండి. దానికి తగ్గుట్టుగానే కార్యక్రమాలు కొనసాగించండి. వీటిని పరిశీలించేందుకు మూడు నెలలకోమారు ఢిల్లీ నుంచి పరిశీలకులను పంపుతాను. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలించండి. ప్రజావ్యతిరేక అంశాలుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.

 

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు సంబంధించి తొలుత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని సీరియస్‌గా పరిగణించి పని ప్రారంభించండి.

 

సంస్థాగతంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పటిష్టం కావాలి.

 

నేడు చంద్రబాబుతో అమిత్‌షా భేటీ

 భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీవర్గాలు తెలిపాయి. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వారు చర్చించే అవకాశముందని ఆ వర్గాలు చెప్పాయి.

 

టీఆర్‌ఎల్‌డీ విలీనం

భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ విలీనమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో గురువారం టీఆర్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ విలీనాన్ని ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఉన్న దిలీప్‌కుమార్ గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎల్‌డీని ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌కు అనుబంధంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ను ఏర్పాటుచేశారు. దిలీప్‌కువూర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, భువనగిరి లోక్‌సభా స్థానానికి కూడా టీఆర్‌ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యూరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top