వేగమే యమపాశం

వేగమే యమపాశం - Sakshi

  • ఓఆర్‌ఆర్‌పై ముగ్గురు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పై ఇద్దరు మృతి ఘటనలు

  •  అతివేగమే కారణమని తేల్చిన పోలీసులు

  • సాక్షి, సిటీబ్యూరో: అతి వేగమే ప్రాణాల్ని బలిగొంటోంది. సోమవారం ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మణం చెందారు. ఈ రెండు ప్రమాదాలకు మితి మీరిన వేగమే ప్రధాన కారణమని అధికారులు తేల్చారు. ఓఆర్‌ఆర్‌పై ఒకటి, రెండో లేన్‌లో వెళ్లాల్సిన కారు లేన్‌ను పాటించకపోవడంతో పాటు మరోపక్క అతివేగంతో వచ్చి ఆరో లేన్‌లో పార్క్ చేసిన లారీని బలంగా ఢీకొట్టింది.



    దీంతో కారులో ఉన్న కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎంవీవీ సూర్యనారాయణరావు భార్య నాగ రామలక్ష్మి (50), కుమార్తె సింధూర (19), బావ మహిధర్ (50) దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి వస్తున్న వీరి కారు ప్రమాద సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోతోంది. ఇక పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైజరిగిన ప్రమాదంలో కారు డ్రైవర్ భాను (26)తో పాటు గౌతం (21) ప్రాణాలు కోల్పోయారు. వీరి కారు కూడా ప్రమాదం జరిగినప్పుడు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు గుర్తించారు.

     

    లారీ లేకుంటే ప్రమాద తీవ్రత తగ్గేది..



    ఓఆర్‌ఆర్‌పై లారీ చెడిపోవడంతో నిబంధనల మేరకు ఆరో లేన్‌లో పార్క్ చేశారు. ఇది ఓఆర్‌ఆర్‌పై తిరిగే ట్రాఫిక్ పెట్రోలింగ్ మొబైల్-3 వాహనం గుర్తించలేదు. పెద్ద గోల్కొండ నుంచి రాజేంద్రనగర్ వరకు ఈ వాహనం పర్యవేక్షిస్తుంది.



    హిమాయత్‌సాగర్ వద్ద సిబ్బంది ఉదయం 9 గంటలకు డ్యూటీ మారుతుంటారు. సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద గోల్కొండలో ఉన్న ఈ మొబైల్ వాహనం ఘటనా స్థలం మీదుగా ఉదయం 8.30కి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ లారీ లేదు. ఈ వాహనం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యూటీ ఛేంజ్ పా యింట్ వద్దకు రాగానే ప్రమాద సమాచారం అందింది. ఆ ప్రాంతం లో లారీ లేకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని అధికారులు భావిస్తున్నారు.



    లారీ కోసం రాత్రి వరకు ఎవరూ రాకపోవడంతో పోలీసులే కాపలాగా ఉన్నారు. కాగా, ఓఆర్‌ఆర్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఓఆర్‌ఆర్ పైకి వాహనం ఎక్కేముందు టోల్‌గేట్ సిబ్బంది ఇచ్చే చిట్టీపై కూడా నిబంధనలు స్పష్టంగా ఉంటాయి. ఇక, ఓఆర్‌ఆర్‌పై స్పీడ్ గన్లు శాశ్వతంగా ఏర్పాటు చేసి ఉంటే వేగం తగ్గించుకునే అవకాశముంది. కానీ ఔటర్‌పై మొబైల్ స్పీడ్ గన్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిని ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో మాత్రమే వాడుతున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top