స్పెషల్ టీచర్లకేదీ చేయూత?

స్పెషల్ టీచర్లకేదీ చేయూత?


- నెలకు రూ. 398 వేతనంతో పని.. ఏళ్ల తరబడి సేవలు

- అయినా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు సర్కారు ససేమిరా

- ఆందోళనలో దాదాపు 15 వేల మంది టీచర్లు

 

సాక్షి, హైదరాబాద్:
ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు అవసరాల కోసం వారంతా స్పెషల్ టీచర్లుగా కొద్దిపాటి వేతనంతోనే పనిచేశారు. ఇలా దాదాపు 15 వేల మంది ఏళ్ల తరబడి సేవలందించారు. అయితే ఇప్పుడు వీరికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 1983 నుంచి దశలవారీగా స్పెషల్ టీచర్లుగా నియమితులై రూ. 398 వేతనంతోనే ఏళ్ల తరబడి పనిచేసి కొంతకాలానికి పర్మనెంట్ అయ్యారు. తాము స్పెషల్‌గా పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతున్నా.. సర్కారు నుంచి స్పందన లేదు. వీరి తర్వాత నియమితులైన అన్‌ట్రైన్డ్ టీచర్లు, స్పెషల్ విద్యా వలంటీర్లకు రెండేళ్ల అప్రెంటిస్ కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చింది.



ఇదీ ‘స్పెషల్’ కథ!

రాష్ట్రంలో 1983 ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా చేరారు. అయితే ఉపాధ్యాయులు తక్కువగా ఉండటంతో భారీగా నియామకాలు అవసరమయ్యాయి. ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారు సరిపడాలేకపోవడంతో అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వంతో పాటు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రూ.398 వేతనంతో స్పెషల్ టీచర్లను నియమించాయి. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 50 వేలమంది రూ.398 వేతనంపై నియమితులయ్యారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లోనే 15 వేల మంది ఉండగా.. వీరిలో పండితులు, పీఈటీలే ఎక్కువ. 1995లో రెండేళ్ల అప్రెంటిస్ విధానం వచ్చింది.



2000, 2001, 2002లో బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు మరిన్ని పోస్టులను శిక్షణపొందని అభ్యర్థులతో(అన్‌ట్రైన్డ్), స్పెషల్ విద్యా వలంటీర్ల పేరుతో నియమించింది. వారు పనిచేసిన రెండేళ్ల అప్రెంటిస్ కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లను మూడేళ్ల కిందట మంజూరు చేసింది. 9వ పీఆర్‌సీలో ఆర్థిక ప్రయోజనం కల్పించింది. స్పెషల్ టీచర్లు ఏళ్ల తరబడి నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం విజ్ఞప్తిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ స్పెషల్ టీచర్లలో అనేక మంది పదవీ విరమణ పొందారు. నోషనల్‌గా ఇస్తే పెన్షన్‌లో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు. వారు మంజూరైన పోస్టుల్లో నియమితులు కాలేదని, వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం కుదరదని ఆర్థికశాఖ చెబుతోంది.

 

నెలకు రూ. 398తో ఐదేళ్లు పని చేశా

1984లో స్పెషల్ లాంగ్వేజ్ పండిట్‌గా చేరి నెలకు రూ. 398 వేతనంతో ఐదేళ్లు పని చేశాను. ప్రస్తుతం పదవీ విరమణ పొందాను. ఆ ఐదేళ్ల కాలాన్ని నోషనల్‌గా పరిగణనలోకి తీసుకుంటే పెన్షన్‌లో ప్రయోజనం చేకూరుతుంది.

- జక్కం దామోదర్, తెలుగు పండిట్, వరంగల్

 

పనిచేసిన కాలానికి డబ్బులు అడగడం లేదు

స్పెషల్ టీచర్‌గా పనిచేసినంత కాలం తక్కువ వేతనం ఇచ్చినా అంకితభావంతో పని చేశాం. ఆ కాలానికి అదనంగా డబ్బులివ్వమని అడగటం లేదు. ఆ కాలాన్ని నోషనల్‌గా పరిగణనలోకి తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.

- రాములు, నల్లగొండ

 

ఆ నియామకాలు మాకోసం చేపట్టలేదు

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే వారు నియమితులయ్యారు. వారికోసమే ప్రత్యేకంగా ఈ నియామకాలు చేపట్టలేదు. అలాంటపుడు మాకు అన్యాయం చేయడం ఏంటి?

- కర్రా నరేందర్‌రెడ్డి, కరీంనగర్

 

తక్కువ వేతనంతో పనిచేయడం తప్పా?

ఏళ్ల తరబడి నెలకు రూ. 398 వేతనంతో పనిచేసి రె గ్యులర్ టీచర్లతో సమానంగా సేవలందించారు. తక్కువ వేతనంతో పని చేయడమే మేం చేసిన తప్పా.

-సరోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి

 

వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి

స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. టీచర్లులేని సమయంలో ఉద్యోగంలో చేరి విశేష సేవలందించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి.

- చావ రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి

 

వారికి న్యాయం చేయాల్సిందే

అన్‌ట్రైన్డ్ టీచర్లకు, స్పెషల్ విద్యా వలంటీర్లకు రెండేసి చొప్పున ఇంక్రిమెంట్లు ఇచ్చారు. స్పెషల్ టీచర్లు ఏం తప్పుచేశారు. వారికి న్యాయం చేయాల్సిందే.

- భుజంగరావు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top