‘హెల్త్’ అలర్ట్!


- వణికిస్తోన్న విషజ్వరాలు  పొంచి ఉన్న డయేరియా ముప్పు

- పీహెచ్‌సీలకు మందుల సరఫరాపై కలెక్టర్ ఆరా  

- సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందే లేకుంటే హెచ్‌ఆర్‌ఏ కోత  

-మంథని డివిజన్‌పై  ప్రత్యేక దృష్టి : డీఎంహెచ్‌వో

 సాక్షి, కరీంనగర్ : జిల్లాలో విజృంభిస్తోన్న విష జ్వరాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. సాధారణంగా... వ ర్షాలు కురిసిన కొన్ని రోజుల తర్వాత విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈ సారి వాతావరణంలో వచ్చిన కొద్దిపాటి మార్పులకే విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది జ్వరపీడితులు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల వ్యవధిలోనే జిల్లాలో పదకొండు మంది విషజ్వరాలు.. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గి చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ ఎక్కువ విషజ్వరాలు ప్రబలినా వైద్యశాఖ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది.



స్వల్ప కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యసిబ్బంది పర్యటించి సత్వరమే వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటోంది. గడిచిన నెల రోజుల్లో ఏడు గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి.. వందలాది మంది జ్వరపీడితులకు వైద్యం అందించింది. జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలతో డయేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.



వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు.. ఒకవేళ ప్రబలితే అందించాల్సిన వైద్యంపై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కె.బాలు దృష్టి సారించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన మంథని డివిజన్ పరిధిలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలుండడంతో అక్కడి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు జిల్లా వైద్యాధికారి కె.బాలు తెలిపారు. త్వరలోనే మెడికల్ ఆఫీసర్లు, ఎస్పీహెచ్‌వోలు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.

 

గ్రామాల్లో ప్రైవేట్, ఏరియా ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం... జ్వరపీడితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనే ఆశ్రయిస్తుండడంతో జిల్లాలోని పీహెచ్‌సీలలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వైద్యశాఖను ఆదేశించారు. ఈ క్రమంలో.. రెండు నెలల వ్యవధిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు, ఆంటిబయోటిక్స్ మందులు, పారాసిటమాల్ పంపిణీ చేసిన మందుల వివరాలు పీహెచ్‌సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో ఏ మేరకు మందులు ఉన్నాయో కూడా వివరాలివ్వాలన్నారు. దీంతో అధికారులు ఇప్పటికే పీహెచ్‌సీల వారీగా పంపిణీ చేసిన మందుల వివరాల నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు.

 

స్థానికంగా ఉండని సిబ్బందిపై ఆరా!

వైద్యవిధాన పరిషత్, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో విధులు నిర్వర్తించే వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలనే నిబంధన ఉంది. అయినా చాలా మంది స్థానికంగా ఉండడం లేదు. ఈ విషయంపై దృష్టిసారించిన వైద్యశాఖ అందుబాటులో ఉండని సిబ్బంది వివరాలు సేకరిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే సిబ్బంది అనుమతి లేనిదే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వదిలిపెట్టి వెళ్లొద్దని డీఎంహెచ్‌వో కొమురం బాలు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో ఉండకుండా.. వైద్యం అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా వారి హెచ్‌ఆర్‌ఏ కోత విధించడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top