కబ్జాదారుల ఆటకట్టేనా?


 కోరుట్ల : సర్కారు స్థలాలకు రక్షణ కరువైంది మహా ప్రభో.. అంటూ వందలాది ఫిర్యాదులు అంది నా ఇన్నాళ్లు స్పందించని రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా జూలు విదిల్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఈ వ్యవహారం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన్ని తలపిస్తోంది. ఇప్పటికే పట్టణంలో చాలాచోట్ల సర్కారు స్థలాలు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి చేరిపోయాయి. ఈ ఆక్రమణలకు తెరదించి ప్రభుత్వ స్థలాలను కాపాడితే మున్ముందు ప్రజావసరాల కోసం వాడుకునేందుకు వినియోగించుకోవచ్చన్న స్పృహాప్రజాప్రతినిధులతోపాటు అధికార యం త్రాంగానికి రావడం ఆశించదగ్గ పరిణామం.



జిల్లాలో రెండో స్థానం

ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్న మండలాల్లో కరీంనగర్ మినహాయిస్తే.. తిమ్మాపూర్ తర్వాత కోరుట్ల రెండోస్థానంలో ఉంది. పట్టణ పరిసరాల్లో పరంపోగు, కారీజుఖాతా, బంచరాయి కింద సుమారు 153 సర్వే నంబర్లలో దాదాపు 1,044 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలాల్లో సుమారు 690 ఎకరాలు వివిధ సామాజిక అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం అసైన్ చేసినట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నా..వీటిలో చాలామేర ఆక్రమణకు గురయ్యాయి. మరో 350 ఎకరాల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కోరుట్లలో భూములకు డిమాండ్ పెరగడంతో కొందరు రియల్ వ్యాపారులు ఈ  స్థలాలపైనా కన్నేశారు.



ఇప్పటికే 1553, 1215,1497, 454, 478, 923 సర్వే నంబర్లతో పాటు కోరుట్ల వాగు కింది స్థలాల్లో చాలాచోట్ల ఆక్రమణలకు గురువుతున్నాయి. రానున్న కాలంలో ఇదేతీరు కొనసాగితే.. డివిజన్ కేంద్రంగా మారే అవకాశాలు పుష్కలంగా కోరుట్లలో ప్రభుత్వ స్థలాల కోసం దేవులాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కలెక్టర్, జగిత్యాల సబ్ కలెక్టర్ లతో మాట్లాడి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు స్పెషల్‌డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.

 

సర్వేకు ఇతర మండలాల అధికారులు

ప్రభుత్వ స్థలాల సర్వేకు స్థానిక అధికారులు ఉపక్రమిస్తే నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు ఉండటంతో ఇతర మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సర్వే బృందం జగిత్యాల సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో కోరుట్ల తహశీల్దార్ అధ్వర్యంలో కొనసాగుతోంది. సర్వే కోసం ప్రత్యేకంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు సర్వేయర్లను నియమించనున్నారు.



సర్వేయర్లు ప్రభుత్వ స్థలాలను సర్వే చేసి గుర్తించిన అనంతరం వాటికి హద్దులను నిర్ణయించి అక్రమణలను నిరోధిస్తారు. అవసరమైతే కొన్ని స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న యోచనలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆక్రమణలకు గురైన చోట కబ్జాదారులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ స్పెషల్‌డ్రైవ్ విషయంలో నేతలు.. అధికారులు తరతమ భేదాలు మాని పారదర్శకంగా వ్యవహారిస్తే ఎంతో మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top