సర్వీసు క్రమబద్ధీకరణకు కమిటీ

సర్వీసు క్రమబద్ధీకరణకు కమిటీ


కాంట్రాక్టు లెక్చరర్లకు

ఉప ముఖ్యమంత్రి కడియం హామీ




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌ టైమ్‌ అధ్యాపకుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వెంటనే ధర్నాలు, ఆందోళనలు విరమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. వర్సిటీల కాంట్రాక్టు, పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లు ఆదివారం కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలసి వారి సమస్యలను వివరించారు. ప్రస్తు తం పరీక్షలు సమీపిస్తున్నాయని, పైగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో సమ్మె చేయడం సరైంది కాదని కడియం అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సమ్మె తక్షణమే విరమించాలన్నారు.


జీతాల పెంపు, సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కూడా త్వరలో జరగనున్న నేపథ్యంలో వర్సిటీలో చక్కని వాతావరణం నెలకొల్పేలా, వర్సిటీ అభివృద్ధికి దోహదపడేలా అధ్యాపకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కడియంను కలిసిన వారిలో యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (కాంట్రాక్టు), తెలంగాణ యూని వర్సిటీస్‌ అసోసియేషన్‌ (కాంట్రాక్టు), ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతలు పరశురామ్, నిరంజన్, ధర్మతేజ, భాగ్యమ్మ, వి.కుమార్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top