ఇక ‘స్మార్ట్’గా రేషన్!

ఇక ‘స్మార్ట్’గా రేషన్!


దసరాకు కొత్త రేషన్ కార్డులు  ప్రత్యేక చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డుల పంపిణీ

 

చిప్‌లో లబ్ధిదారుడి వివరాలు, కుటుంబ సభ్యుల వేలిముద్రలు

కుటుంబ సభ్యుల్లో ఎవరు వెళ్లినా తీసుకోవచ్చు

క్షణాల్లో సరుకుల విక్రయాలసమాచారం

అధికారులకుతెల్ల కార్డులకు ఇతర సంక్షేమ పథకాలతో లంకె తొలగింపు


 

హైదరాబాద్: పేదలకు అందించే చౌక ధరల సరుకులు పక్కదారి పట్టకుండా రాష్ర్ట ప్రభుత్వం ‘స్మార్ట్’గా ఆలోచిస్తోంది. రేషన్ అక్రమాలను అడ్డుకునే దిశగా సరికొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దీంతో కార్డుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయేలా కసరత్తు చేస్తోంది. రాష్ర్టంలోని కుటుంబాల సంఖ్య కన్నా రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పకడ్బందీ చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రస్తుతమున్న రేషన్ కార్డుల స్థానంలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డును జారీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు రాజముద్రతో కూడిన ఈ కొత్త కార్డులను దసరా పండుగ నుంచి అమలులోకి తేవడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆధార్ కార్డు కోసం ఇప్పటికే సేకరించిన కుటుంబ సభ్యుల వేలిముద్రలను.. ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు అనుసంధానం చేసి బోగస్ బెడదను వదిలించుకోవాలని యోచిస్తున్నారు. రాష్ర్టంలోని కుటుంబాలకంటే 20 లక్షలకుపైగా రేషన్ కార్డులు అధికంగా ఉండటంతో ఈ వ్యవస్థనే సమూలంగా మార్చాలని ప్రభుత్వం తాజా నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖలోని ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. బోగస్ కార్డుల కారణంగా వంద ల కోట్ల ప్రజాధనం దళారుల జేబుల్లోకి వెళ్తోందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. రేషన్ పంపిణీలో అవినీతిని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకోవడంతో..



దీన్ని అరికట్టడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డుల పంపిణీ వల్ల ప్రస్తుతమున్న వాటిలో దాదాపు 30 శాతం కార్డులు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారికి అంత్యోదయ కార్డులు ఎందుకన్న అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రేషన్ కోసం జారీ చేసే స్మార్ట్ కార్డులతో ఇతర సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు కేవలం రేష న్ సరుకుల పంపిణీ, చిరునామా ధ్రువీకరణకు మాత్ర మే ఉపయోగపడేలా ఆదేశాలు ఇవ్వనుంది. ఆరోగ్యశ్రీ పథకం కోసమే అందరూ తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెల్ల కార్డులకు సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా చేయడం ద్వారా వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top