కన్నతల్లికి నరకం చూపించాడు

ఆర్డీవోతో వృద్ధురాలి కొడుకు, కోడలు, మనమరాలు వాగ్వాదం - Sakshi


రెండు నెలలుగా వరండాలోనే ఉంచుతున్న కొడుకు

ఎండలకు తట్టుకోలేక వృద్ధురాలి నరకయాతన

స్థానికుల ఫిర్యాదుతో ఆస్పత్రికి తరలించిన అధికారులు

కొడుకు, కోడలు, మనవరాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు




మంచిర్యాల టౌన్‌: కాటికి కాళ్లుచాచిన కన్నతల్లిని కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన కొడుకు ఆలనాపాలనా మరిచాడు. వృద్ధురా లిని రెండు నెలలుగా ఇంటి వెనుకాల ఉన్న వరండాలో పడేశాడు. తిండి సైతం సరిగా పెట్టడం లేదు. ఎండవేడిమితో నరకయాతన పడుతున్న వృద్ధురాలు ఆదుకోవాలంటూ అరిచినా పట్టించుకోవడం లేదు. వృద్ధురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారు లు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు.



మంచిర్యాల జిల్లాకేంద్రంలోని పవన్‌ నిల యం అపార్టుమెంట్‌లోని మూడో అంతస్తులో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు వెంకటరామనర్సయ్య భార్య, కూతురుతో కలసి ఉంటున్నాడు. ఇతని కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తు న్నాడు. వెంకటరామనర్సయ్యకు తల్లి రాధా దేవి(85) ఉంది. వృద్ధురాలైన తల్లికి సేవ చేయడం ఇష్టంలేని వెంకటరామనర్సయ్య ఆమెను ఇంటి వెనకాల ఉన్న చిన్నపాటి వరండాలో రెండు నెలల నుంచి ఉంచుతు న్నాడు. పదిరోజులుగా ఎండతీవ్రత ఎక్కువ కావడం, ఇంటి వెనకాల ఉన్న వరండాలోకి నేరుగా ఎండపడడం, గచ్చునేలపై పడేయడం తో ఆ వృద్ధురాలు నానా ఇబ్బందులు పడుతోంది. ఒంటిపై సరైన బట్టలు కూడా లేకపోవడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక విలవిలలాడుతోంది.



 అక్కడే తినడం, అక్కడే ఉండడం, అక్కడే కాలకృత్యాలను తీర్చుకోవడం, నల్లా నీటిని బకెట్లో పట్టుకుని తాగుతూ క్షణమొక యుగంలా గడుపుతోంది. వేడిమికి తట్టుకోలేక రోజంతా అరుస్తూనే ఉన్నా కనీసం ఆమెను కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. వృద్ధురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఏం జరుగుతుందని అడిగేందుకు ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో స్థానికులు మంగళవారం కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆర్డీవో ప్రతాప్‌ను సంఘటన స్థలానికి వెళ్లి వృద్ధురాలికి సంరక్షణ కల్పించాలని ఆదేశించారు.



అధికారులపైకి ఎదురుదాడి..

ఆర్డీవో ప్రతాప్, తహసీల్దార్‌ సదానందం వరండా తలుపు తీయాలని వెంకటరామ నర్సయ్యను కోరగా, మీకు అవసరం లేదంటూ వెంకట్రామయ్య.. అతని భార్య, కూతురు అధికారులు, మీడియాపై విరుచుకుపడ్డారు. ఆర్డీవో పోలీసులకు సమాచారం అందించగా తమపైనే దాడి చేశారంటూ వెంకటరామనర్సయ్య కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. స్థానికులు కలగజేసుకుంటే మీకు అవసరం లేదంటూ వారిపైకి విరుచుకుపడ్డారు. ఆర్డీవో ఆదేశాల మేరకు ఆ ముగ్గురినీ మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



స్టేషన్‌కు తరలించే సమయంలోనూ తాము ఏ తప్పు చేయలేదని, ఇది తమ ఇంటి విషయమంటూ వాగ్వాదానికి దిగారు. వృద్ధురాలిని మంచిర్యాల ప్రభుత్వా సుపత్రికి అంబులెన్సులో తరలించిన అధికారులు.. చికిత్స అందించిన అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి తరలించ నున్నట్లు ఆర్డీవో తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top