రైతులకు సోలార్ పంపుసెట్లు: కేసీఆర్


విద్యుత్ కొరత, రైతుల ఇబ్బందులను అధిగమించే అవకాశం  

నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. 1.5 కోట్లకు పెంపు

అభివృద్ధి పనులన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..

అధికారుల బదిలీలకు ప్రతిపాదనలు ఇవ్వండి

టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచన


 సాక్షి, హైదరాబాద్: రైతులకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటుచేసి, పదేళ్ల దాకా వాటి ఖరీదును కూడా అడగబోమంటూ ఒక కంపెనీ ప్రతిపాదన చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ కొరతను, రైతులు ఇబ్బందులను అధిగమించడంతో పాటు ఇప్పటికిప్పుడు ఇటు ప్రభుత్వంపైనా, అటు రైతుల పైనా ఆర్థిక భారం ఉండదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్ లో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ బావులకు సోలార్ పంపుసెట్లు, నియోజకవర్గ అభివృద్ధినిధుల పెంపు, నియోజక వర్గాలకు సంబంధించిన బదిలీలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ కొరత, రైతుల సమస్యలను గురించి ప్రస్తావిస్తూ.. సోలార్ పంపుసెట్ల ఏర్పాటు గురించి వెల్లడించారు.

 

  తెలంగాణలో ఉచితవిద్యుత్ పొందుతున్న కనెక్షన్లకు సోలార్ పంపుసెట్లను బిగించడానికి ఒకకంపెనీ (కిర్లోస్కర్) ముం దుకు వచ్చిందని.. ఆ పంపుసెట్లను ఇప్పుడు బిగించి, పదేళ్లదాకా నిర్వహణ బాధ్యత కూడా చూస్తామని ప్రతిపాదించిందని చెప్పా రు. ఆ పంపుసెట్లు పదేళ్లు సరిగా నడిచిన తర్వాతే వాటికి డబ్బు చెల్లించాలంటూ ఆ కంపెనీ చేసిన ప్రతిపాదన ఎలా ఉందని  అడిగారు. తెలంగాణలో 20 లక్షల పంపుసెట్లను రెండేళ్లలోగా 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు ఇవ్వడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చిందని సీఎం వివరించారు. దీనివల్ల విద్యుత్ కొరత, రైతుల ఇబ్బందుల ను అధిగమించడంతో పాటు ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై, రైతులపై ఆర్థికభారం ఉండదని పేర్కొన్నారు.

 

నియోజకవర్గ నిధులు పెంపు

 ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ. కోటిన్నరకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను రూ. 2 కోట్లకు పెంచుతామన్నారు. ఏ జిల్లాకు చెందిన మంత్రి అదే జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తారని సీఎం చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యుడే సుప్రీం అని... అభివృద్ధి పనులన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల్లోని అధికార యంత్రాంగం అక్కడి శాసనసభ్యుడితో సమన్వయంతో పనిచేసుకునే విధంగా చూసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేతో అధికార యంత్రాంగానికి సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను వెంటనే ఇవ్వాలని ప్రజా ప్రతి నిధులకు సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయిల్లోని అధికారుల బదిలీల ప్రతిపాదనల ను కూడా వెంటనే ఇవ్వాలన్నారు. ఓటర్ల గణన మొదలైతే బదిలీలకు మరింత జాప్యం జరిగే అవకాశముందని, ఆ లోపుగానే బదిలీలకు ప్రతి పాదనలను అందించాలని సూచించారు. అనంతరం జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లోని రాజకీయ స్థితిగతులు, అభివృద్ధి ప్రతిపాదనలు, బదిలీలు వంటి అంశాలపై వారు సీఎంకు నివేదించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top