‘భవన్’లకు బంధనాలు

‘భవన్’లకు బంధనాలు - Sakshi


సామాజిక భవనాల నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు

నిధులు కేటాయించినా.. నిర్మాణాలు సున్న

భూ వివాదంతో శంకుస్థాపనలకే పరిమితం

ఐదు సామాజిక వర్గాల భవన్‌ల పరిస్థితి ఇదే..

తలలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం


 

 రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్మించనున్న సామాజిక వర్గాల భవన్‌లకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వివిధ సామాజిక వర్గాల వినతి మేరకు రాజధానిలోనే వీటిని నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు భవన్‌లు మంజూరు చేశారు. వీటికి నిధులు కేటాయించడంతో పాటు కొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇదంతా జరిగి ఆరు నెలలు గడుస్తున్నా... న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ఈ భవన్‌లకుఇప్పటి వరకు పునాది కూడా పడలేదు. దీనికి ప్రధాన కారణం వీటికి కేటాయించిన భూములు వివాదాల్లో ఉండటమే.     

 - సాక్షి, హైదరాబాద్

 

 ‘కొబ్బరికాయ’ కొట్టారంతే

 గతంలో ఇచ్చిన హామీల మేరకు హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం జంజారాహిల్స్‌లో 2014 డిసెంబర్ 11 న జంజారా భవన్, కొమురం భీం భవన్‌లకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బాబు జగ్జీవన్ రాం భవన్‌ను కూడా ఇక్కడే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జంజారా, కొమురం భీం భవన్‌లకు రూ.2.50 కోట్లు, బాబు జగ్జీవన్ రాం భవన్‌కు రూ.2.50 కోట్ల నిధులను కేటాయించి, నిర్మాణ పనులను గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించారు.  క్రిస్‌మస్ వేడుకల సందర్భంగా మారేడుపల్లి మండలంలోని మహేంద్రహిల్స్‌లో 2014 డిసెంబర్ 23న క్రిస్టియన్ భవన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఇక్కడే దొడ్డి కొమురయ్య భవన్ నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే క్రిస్టియన్ భవన్ కు రూ.2 కోట్లు, దొడ్డి కొమురయ్య భవన్‌కు రూ.5 కోట్లు కేటాయించారు.   

 

 వివాదాల్లో స్థలాలు ...

 హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఐదు భవన్‌లకు భూములు కేటాయిస్తే... అవన్నీ న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. దీంతో వీటి నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు. జంజారా, కొమురం భీం భవన్‌లకు జంజారాహిల్స్ సర్వే నంబరు 403 లోని రెండు ఎకరాలు కేటాయిస్తే.. ఈ భూమి తనదేనని మల్బాన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం దీని నిర్మాణంపై హైకోర్టు స్టేటస్‌కో( యథాతథ స్థితి) విధించింది. దీనిపై కౌంటర్ ఫైలు దాఖలు చేశామని అధికారులు చెబుతున్నారు. అలాగే, క్రిస్టియన్ భవన్, దొడ్డి కొమురయ్య భవన్‌లకు మహేంద్ర హిల్స్‌లో కేటాయించిన భూములు కూడా వివాదాల్లోనే ఉన్నాయి. ఈ భూములు తనవేనని వడ్డెర సంఘానికి చెందిన పాపయ్య కోర్టు కెళ్లగా.. హైకోర్టు దీనిపై కూడా స్టేటస్‌కో ఇచ్చింది.  

 

 మరో నాలుగు భవన్‌లకు...

 ఇదిలా ఉండగానే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే యాదవ, బ్రాహ్మణ, సిక్కు భవన్‌ల కోసం సత్వరమే భూసేకరణ చేపట్టాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కేరళ భవన్‌కు కూడా ఎకరం స్థలం కేటాయిస్తామని గతంలో ఓనం వేడుకల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పటికే కేటాయించిన భూములు వివాదాల్లో ఉండడం ఇప్పుడు మరిన్ని భవనాలకు స్థలాలు కేటాయించాలని సర్కారు ఆదేశించడంతో ఏం చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top