స్మార్ట్ సిటీ

స్మార్ట్ సిటీ - Sakshi


నగర శివార్లలో ఏర్పాటుకు సన్నాహాలు

ఐటీ కంపెనీలు సహా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులు

సర్వ హంగులతో నిర్మించేందుకు ముందుకొచ్చిన దుబాయ్ సంస్థ

300 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖత

త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం




సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో అందమైన, అధునాతన నగర (స్మార్ట్ సిటీ) నిర్మాణానికి దుబాయ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల ఆ దేశ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో త్వరలోనే ‘స్మార్ట్‌సిటీ’ కార్యరూపం దాల్చే అవకాశముంది. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) పరిధిలో ఈ సిటీని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర సర్కారు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

 

 సకల హంగులతో నిర్మించే స్మార్ట్ సిటీలో ఐటీ కంపెనీలు సహా వాణిజ్య, నివాస సముదాయాలుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడమేకాకుండా.. అధునాతన జీవనశైలికి అనుగుణంగా ఈ సిటీలో సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో పర్యటనలో భాగంగా అక్కడి ‘స్మార్ట్ సిటీ’ని సందర్శించారు.

 

 ఈ నిర్మాణ శైలిని చూసి ముచ్చటపడ్డ మంత్రి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రతినిధి బృందం నగర శివార్లలో స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఆసక్తి చూపింది. ఈ క్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) ఐటీఐఆర్ పరిధిలోని కోహెడ, రావిర్యాల, శంషాబాద్ ప్రాంతాల్లోని భూములను చూపింది. ఈ మూడు స్థలాల పట్ల మొగ్గు చూపిన స్మార్ట్‌సిటీ నిర్మాణ సంస్థ.. కనిష్టంగా వేయి ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది.

 

 అయితే, భారీ విస్తీర్ణంలో భూమి కావాలని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేయడంతో డైల మాలో పడ్డ టీఐఐసీ 300 ఎకరాల మేర తక్షణమే కేటాయిస్తామని సెలవిచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పని స్మార్ట్ సిటీ ప్రతినిధులు.. యాజమాన్యంతో సంప్రదించి తుది నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ కృతనిశ్చయంతో ఉండడంతోపాటు అధునిక నగరానికి ప్రతీకగా ఈ ప్రాజెక్టు ఉండాలని ఆయన భావిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే టీఐఐసీ కూడా స్థలాల గుర్తింపుపై దృష్టి సారించింది. శంషాబాద్ మండలం ‘111’ జీఓ పరిధిలో ఉన్నందున.. రావిర్యాల లేదా కోహెడలో స్మార్ట్ సిటీకి భూములు కేటాయించేదిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ నిర్మాణ సంస్థ కొచ్చి నగర శివార్లలో స్మార్ట్‌సిటీని అభివృద్ధి చేస్తోంది. దుబాయ్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ కావడం.. నిర్మాణరంగంలో విశేష అనుభవం ఉన్న దృష్ట్యా ఈ సంస్థ ప్రతిపాదనలకు అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top