ఆరు నెలల్లోనే తిరుగుబాటు

ఆరు నెలల్లోనే తిరుగుబాటు


టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరు నెలల్లోనే తిరుగుబాటు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అన్నారు.. వీరు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షలో పాల్గొని మాట్లాడారు..  

 

వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరు నెలల్లోనే తిరుగుబాటు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై హన్మకొండలోని కాంగ్రెస్ భవన్‌లో శనివారం చేపట్టిన సమీక్షా సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 75లక్షల మందికి పింఛన్లు, 50లక్షల మందికి ఇళ్లు, రైతాంగానికి రుణాలు అందించిన చరిత్ర ఉందన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతోనే ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యత్వానికి ప్రజలు, వివిధ వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 25లక్షల సభ్యత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రగామిగా ఉందన్నారు. సోనియాగాంధీ జన్మదినాన్ని తెలంగాణ డిక్లరేషన్ డేగా ప్రకటించిన విషయాన్ని వివరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీని పటిష్టం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.ఎస్.కుంతియా మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వాన్ని నెలాఖరు వరకు పూర్తి చేయాలని అన్నారు.

 సభ్యత్వంపై సమీక్ష

 జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చేపట్టిన సభ్యత్వంపై పొన్నాల, కుంతి యా సమీక్షించారు. ఈ నెలాఖరు వరకు పూర్తి సభ్యత్వాన్ని చేపట్టి జిల్లాను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని సూచించా రు. జిల్లా, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఒక్కో నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహించారు.



సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి కుసుమకుమార్, డీసీసీ అధ్యక్షుడు నాయి ని రాజేందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు బలరాంనాయక్, బస్వరాజు సార య్య, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య, డాక్టర్ విజయరామారావు, ఎర్రబెల్లి స్వర్ణ, కొండేటి శ్రీధర్, దుగ్యాల శ్రీనివాసరావు, జంగా రాఘవరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వెంకటస్వామిగౌడ్, భరత్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ హరిరమాదేవి, సిరిసిల్ల రాజయ్య, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బట్టి శ్రీనివాస్, శ్రీకర్, ఘంట నరేందర్‌రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, సాంబారి సమ్మారావు, బస్వరాజు కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8,550 పుస్తకాలకు సభ్యత్వం చేపట్టిన 4,400 పుస్తకాలు టీపీసీసీ అధ్యక్షుడికి అందజేశారు.



దొంతి గైర్హాజరు



జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి పొన్నాల, దొంతి మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. దొంతి తిరిగి కాంగ్రెస్‌కు రావడం పొన్నాలకు ఇష్టం లేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దొంతి సైతం సమీక్ష సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నర్సంపేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీక్షలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పొన్నాలను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు కాకుండా ఓడిపోయిన అభ్యర్థికే ప్రాధాన్యతనిస్తున్నారనే అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దీంతో సమావేశం కొంత వేడెక్కినట్లు తెలిసింది. తన ఓటమికి కూడా ఇదే కారణమని అన్నట్లు తెలిసింది. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, కుంతియా, కుసుమకుమార్‌ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top