వివాహిత హత్య కేసులో ఆరుగురి అరెస్టు


 మామిడికుదురు : సంచలనం కలిగించిన వివాహిత హత్య కేసులో ఆరుగురు ముద్దాయిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన అంతటి శిరీష (25)ను గత ఏడాది ఆగస్టు మూడో తేదీన రాజోలు మండలం తాటిపాకలో హత్య చేసి శవాన్ని మామిడికుదురు మండలం పాశర్లపూడిలో పాతి పెట్టిన సంగతి విదితమే. ఈ హత్య కేసులో ముద్దాయిల వివరాలను అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎల్.అంకయ్య, రాజోలు సీఐ జీవీ కృష్ణారావు తెలిపారు. శిరీష హత్య కేసులో ఆమె భర్త గెడ్డం జగదీష్‌తో పాటు గుండుమేను ఏసుబాలరాజు, బిక్కిన దుర్గాప్రసాద్, గెడ్డం నాగరాజు, చుట్టుగుళ్ల వరప్రసాద్, బుంగా భగవాన్‌దాస్‌లను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు ముద్దాయిలు గెడ్డం రమేష్, ఉండ్రు ఏడుకొండలు పరారీలో ఉన్నారని చెప్పారు.

 

 శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు

 పాశర్లపూడి గ్రామానికి చెందిన జగదీష్‌కు హైదరాబాద్‌లో  శిరీషతో పరిచయం ఏర్పడింది. 2013 మార్చిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 2014 జనవరి 3న శిరీష మగబిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఇదిలా ఉండగా జగదీష్‌కు 2013 ఫిబ్రవరి 15న ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన ఉషారాణితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, మొదటి భార్య నుంచి ఒత్తిడి రావడంతో పాటు శిరీష నుంచి కూడా ఒత్తిడి తీవ్రమైంది. దీంతో శిరీషను కొట్టి చీర కొంగుతో  ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. స్నేహితుల సహాయంతో తాటిపాక నుంచి ఆటోలో శిరీష శవాన్ని తీసుకు వచ్చి పాశర్లపూడిలోని డ్రైన్ గట్టున పాతిపెట్టాడు. శిరీష అన్నయ్య ధనుంజయ్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించి ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. నగరం, మలికిపురం ఎస్సైలు బి.సంపత్‌కుమార్, ఎస్‌ఎం పాషా, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీను, కానిస్టేబుళ్లు కె.గణేష్‌బాబు, బి.సుబ్బారావులను డీఎస్పీ అంకయ్య, సీఐ కృష్ణారావు అభినందించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top