రామన్‌పాడులో సమ్మె సైరన్

రామన్‌పాడులో సమ్మె సైరన్


- నేటినుంచి పెండింగ్ జీతాల కోసం ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మికులు

- శుక్రవారం అర్ధరాత్రి నుంచి మోటార్లు బంద్

- 130 గ్రామాలకు నిలిచిపోనున్న నీటి సరఫరా

గోపాల్‌పేట :
అచ్చంపేట రక్షిత మంచినీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. పెండింగ్ జీతాల కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి పంప్‌హౌసుల్లో మోటార్లు బంద్ చేసి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో రామన్‌పాడు హెడ్‌వర్క్ నుంచి పూర్తి స్థాయిల్లో సరఫరా స్తంభించిపోయి వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని సుమారు 130 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇటీవల పలుచోట్ల లీకేజీలు, పగిలిన చోట మరమతు పనులు పూర్తి చేసి గురువారం నుంచి సరఫరాను పునరుద్ధరించారు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.



దీంతో 130 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రతరమైంది. 4 నెలల పెండింగ్ జీతాలు, పీఎఫ్ అమలు చేయాలని, లేకుంటే అగస్టు 1 నుంచి సమ్మె చేస్తామని ముందస్తుగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు రామన్‌పాడు కార్మికులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. రామన్‌పాడు మంచినీటి పథకంలో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులకు ఏప్రిల్ నుంచి జూలై వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఎఫ్ అమలు కావడంలేదు.



గతంలో కార్మికుల జీతాలు, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మోటార్లు బంద్ చేసి పంప్‌హౌస్‌లకు తాళాలు వేసి ఆందోళనలకు దిగారు. ప్రతిసారి కార్మికులు ఆందోళనలు చేయడం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడడం.. ఆ తర్వాత గడువు ఇచ్చి జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఇలా రోజుల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాసిరకం పైపులతో తరుచూ సరఫరాను నిలిపివేస్తుండడంతో దీనిపైనే ఆదారపడిన ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.

 

నిధులు మంజూరు కాలేదు

జీతాల కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలుసు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి పథకాల మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల కాలేదు. కాబట్టి ఏప్రిల్ నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టర్‌ను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడాలి.

-రాములుగౌడు,

ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top