సింగరేణి కార్మికవాడల్లో కాసుల గలగల


కొత్తగూడెం (ఖమ్మం) : సింగరేణి వ్యాప్తంగా కార్మిక వాడల్లో కాసుల వర్షం కురవనుంది. నెల వ్యవధిలో మూడు విధాలుగా కార్మికుల ఇంట్లోకి లక్ష్మీదేవి రానుంది. సింగరేణిలో వివిధ కేడర్లలో పని చేస్తున్న 53 వేల మంది కార్మికులకు రూ.లక్ష చొప్పున సుమారు రూ.460 కోట్లు జేబులు నింపనున్నాయి. సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి 21 శాతం కార్మికులకు గత నెల 30న చెల్లించింది. సంస్థ సాధించిన రూ.469 కోట్ల నుంచి రూ.119 కోట్లను కార్మికుల ఖాతాల్లో యాజమాన్యం జమ చేసింది. ఒక్కో కార్మికుడికి మస్టర్ల ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు లాభాల వాటా లభించింది.



ఇక ఈ నెలలో దసరా పండుగ ఉండటంతో కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ కింద రూ.16 వేల చొప్పున యాజమాన్యం అందచేయనుంది. సుమారు రూ.84 కోట్లను కార్మికులు దసరా పండుగ అడ్వాన్స్ కింద అందుకోనున్నారు. అనంతరం కోలిండియాతో జాతీయ కార్మిక సంఘాలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దీపావళి బోనస్ కింద రూ.48,500 చొప్పున కార్మికుల ఖాతాల్లో జమచేయనుంది. దీపావళి బోనస్‌ వల్ల సింగరేణి సంస్థపై రూ.257 కోట్ల అదనపు భారం పడనుంది.



వ్యాపార సముదాయాలు కళకళ..

ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న 11 ఏరియాల పరిధిలోని కార్మిక వాడల్లో వ్యాపార సముదాయూలు కళకళలాడనున్నాయి. ఒక్కో కార్మికుడు సుమారు రూ.లక్ష వరకు దీపావళి బోనస్, లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్‌తోపాటు నెలసరి జీతం అందుకోనున్నారు. కార్మికులకు వచ్చిన డబ్బులతో ఎక్కువ శాతం షాపింగ్‌కు ఖర్చుచేసే అవకాశం ఉంది.



అందులోనూ ఈ నెల 22న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో లాభాల వాటా, దసరా అడ్వాన్స్‌లతో దుస్తులు, బంగారు ఆభరణాలు, సరికొత్త గాడ్జెట్స్, వాహనాల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఒకవైపు కార్మికుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలతోపాటు వ్యాపార వర్గాల్లో సైతం కొత్త ఉత్సాహం నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top