సింగరేణిలో మోగిన సమ్మె సైరన్

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్ - Sakshi


కరీంనగర్/మంచిర్యాల‌: వారసత్వ ఉద్యోగ అవకాశాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి కార్మికులు సింగరేణి వ్యాప్తంగా సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె వల్ల భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనులపై ప్రభావం పడనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. సమ్మెను జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌ తలపెట్టగా విప్లవ కార్మిక సంఘాలు, కులసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. బలవంతంగా పనిచేయించేందుకు యాజమాన్యం యత్నిస్తోంది. బొగ్గు గనుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.





సింగరేణిలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ సమ్మెను వ్యతిరేకిస్తోంది. మరోవైపు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోనూ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వారసత్వ ఉద్యోగాలతో పాటు 9 డిమాండ్లు నెరవేర్చాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ కార్మికులు విధులకు హాజరుకాలేదు. సింగరేణి వ్యాప్తంగా 57,302మంది కార్మికులుండగా ఇందులో కొందరు అనుకూలంగా, మరికొందరు సమ్మెకు వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం సింగరేణిలో 30 భూగర్భ గనులు, 16 ఉపరితల గనులున్నాయి.



పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో 4 ఓపెన్ కాస్టులు, 13 భూగర్బ బొగ్గుగనుల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. రాత్రి షిప్టు డ్యూటికి హాజరైన కార్మికులతో యాజమాన‍్యం బలవంతంగా పని చేయించేందుకు యత్నిస‍్తోంది. అధికారుల ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గోదావరిఖని వన్ ఇన్ క్లైన్ బొగ్గు వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేస్తున్నారు. సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) దూరంగా ఉన్నప్పటికీ కార్మికులు విధులకు హాజరుకాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top