వేటు

వేటు - Sakshi


వికారాబాద్ : విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూడూరు మండలం చన్గోముల్ ఠాణా ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్ వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు కేసులు నమోదు చేయడానికి బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడన్నారు. రెవెన్యూ కేసులలో సెటిల్‌మెంట్లు చే స్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.



పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అవ కాశమిచ్చినప్పటికీ నాగరాజు ప్రవర్తనలో మార్పు రాలేదని, దీంతో సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి పోలీస్టేషన్‌కు వచ్చేవారి నుంచి అనేక విధాలుగా డబ్బులు వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని శ్రీనివాసులు చెప్పారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారితో సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవహరించారని పేర్కొన్నారు. పోలీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోవడమే కాకుండా అక్రమ సంపాదనకు తెర లేపారన్నారు.



ఇసుక అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మామూళ్లు వసూలు చే సి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ఎస్‌బీ ఎస్‌ఐ కొమురయ్యను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎస్‌ఐ నాగరాజు కేసులు నమోదు చేయడంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, కొన్ని కేసులలో డబ్బులు తీసుకున్నాడని, ఇసుక లారీల యజమానుల నుంచి డబ్బులు వసూలుకు కానిస్టేబుల్ వెంకటేష్‌ను నియమించుకున్నట్లు తమ విచార ణలో తేలిందని ఎస్పీ తెలిపారు.



సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ వివిధ రకాల భూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడని తేలిందన్నారు. పీఎస్‌కు ఇచ్చిన వాహనానికి కొత్త  టైర్లు అమర్చేందుకు మండలంలోని పలువురు వ్యక్తుల నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ ద్వారా భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసిన విషయం వీడియో టేపుల  ద్వారా విచారణలో వెల్లడైందన్నారు.  అదే విధంగా పోలీస్ సిబ్బంది, ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడనే విషయం రుజువు కావడంతో ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్ వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top