షోరూమ్‌ల్లోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్


* హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ కూడా అక్కడే

* ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఉండవు

* అమలు దిశగా రవాణా శాఖ సన్నాహాలు


సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లలో ఇప్పటివరకు ఉన్న రెండు రకాల రిజిస్ట్రేషన్ల విధానానికి త్వరలో తెరపడనుంది. ఇక వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ను బిగించి ఇస్తారు. దీంతో వాహనదారులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోపాటు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజును షోరూమ్‌లలోనే చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది.



ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్ పద్ధతికి కూడా స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఎం పరీశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన కొద్దిరోజుల్లోనే అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో  చెప్పారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇక ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానాన్ని తెలంగాణ అంతటా  పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ భావిస్తోంది.

 

రోజూ వేలసంఖ్యలో నమోదు

ఇప్పటివరకు మోటారు వాహన నిబంధనల ప్రకారం వాహనాలు కొనుగోలు చేసిన నెలరోజుల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొద్దిపాటి జరిమానాతో 6 నెలల వరకు కూడా అనుమతిస్తారు. ఇలాంటి  వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, రోడ్డు భద్రతా నిమయాలను అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు తలె త్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది.



వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను షోరూమ్‌లకు అప్పగించే ప్రతిపాదనపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట కొందరు డీలర్లు వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. రవాణాశాఖ  నిర్వహించే దాడుల్లోనూ తరచూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను షోరూమ్‌లకు కట్టబెట్టడం వల్ల డీలర్లపై రవాణాశాఖ నియంత్రణ ఏ మాత్రం ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top