చూపు తగ్గిందని ఆస్పత్రికి వెళితే.. రెండు కళ్లూ పోగొట్టారు

చూపు తగ్గిందని ఆస్పత్రికి వెళితే.. రెండు కళ్లూ పోగొట్టారు

  •  ఆరోగ్యశ్రీ ద్వారా రూ.70 వేల చెల్లింపు

  •   కవాడిగూడలో బాధితుడి ఆందోళన

  •   ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

  • కవాడిగూడ:  కంటి చూపు మందగించిందని, వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే వైద్యులు ఉన్న చూపును కూడా పోగొట్టి పూర్తి గుడ్డివాడిని చేశారు. ఈ సంఘటన వెస్ట్ మారేడ్‌పల్లిలోని పుష్పగిరి ఐ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు న్యాయపోరాటానికి దిగుతున్నాడు.



    వివరాల్లోకి వెళితే... కవాడిగూడకు చెందిన అవనిగంటి సిద్ధయ్య(40) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా కంటి చూపు తగ్గుతుండటంతో వెస్ట్ మారేడ్‌పల్లిలోని పుష్పగిరి ఐ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేసి కంటి పొరలను తొలగిస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. దీంతో సిద్ధయ్యలో గత ఏడాది జనవరి 31నలో ఆస్పత్రిలో చేరాడు. ఐదు రోజుల తర్వాత వైద్యులు డాక్టర్ మురళీధర్ ఆపరేషన్ చేశారు.



    అయితే, ఆపరేషన్ అనంతరం తన కుడి కన్ను కనిపించడం లేదని సిద్ధయ్య వైద్యుల వద్ద వాపోయాడు. అయితే, కుడి కన్ను చూపు తిరిగి రావాలంటే ఎడమ కంటికి కూడా ఆపరేషన్ చేయాలని, లేకుండే చూపు పోతుందని భయపెట్టారు. దీంతో బాధితుడు ఎడమ కంటి ఆపరేషన్‌కు సిద్ధవగా.. గత ఏడాది జూలైలో డాక్టర్ మురళీధరే ఆపరేషన్ చేశారు. అయితే, ఇప్పుడు సిద్ధయ్య రెండు కళ్ల చూపూ పోయింది. రెండు కళ్లకు శస్త్ర చికిత్స చేసినందుకు ఆస్పత్రికి రూ.70 వేలు ఆరోగ్యశ్రీ నుంచి మంజూరయ్యాయి.

     

    అంతా బాగుందని రిపోర్టు..

     

    ఇదిలా ఉండగా సిద్ధయ్యకు ఆపరేషన్ చేసిన అనంతరం డిశ్చార్జ్ చేసిన రిపోర్టులో మాత్రం ‘స్టేటస్ గుడ్’ అని ఉండడం గమనర్హం. అంతే కాకుండా మొదట తన కుడి కన్నుకు ఆపరేషన్ చేశారని, ఆ తర్వాతే ఎడమ కంటికి చేశారని సిద్ధయ్య చెబుతున్నాడు. కానీ, రిపోర్టులో మాత్రం ముందు ఎడమ కన్నుకు ఆపరేషన్ చేసినట్టుగా, రెండో సారి మాత్రమే కుడి కంటికి చేసినట్టు ఉంది. ఈ ఆస్పత్రిలో తనతో పాటు ఆపరేషన్ చేయించుకున్నవారి పరిస్థితి కూడా తనలాగే ఉందని ఈ సందర్భంగా సిద్ధయ్య వాపోయాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆస్పత్రి వర్గాల నుంచి ఈ విషయంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సంబంధిత అధికారులు అందుబాటులోకి రాలేదు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top