ఓరుగల్లు పులకింత

ఓరుగల్లు పులకింత - Sakshi


నగరంలో షర్మిల పరామర్శ యాత్ర

గ్రేటర్ వరంగల్‌లో విశేష స్పందన

నాలుగో రోజు ఏడు కుటుంబాలకు పరామర్శ

నేటితో ముగియనున్న మొదటి దశ యాత్ర


 

వరంగల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్సార్ తనయ షర్మిల పరామర్శ యాత్రతో వరంగల్ నగరం గురువారం సందడిగా మారింది. కాజీపేట నుంచి చౌరస్తా మీదుగా నర్సంపేట  రోడ్డువైపు సాగిన పరామర్శ యాత్రను చూసేందుకు నగరంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ, చేయి ఊపి పలకరిస్తూ షర్మిల పరామర్శ సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల, వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం వరంగల్ నగరంలో, పరకాల నియోజకవర్గంలో ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఖాజీపేట నుంచి వరంగల్ మీదుగా 68 కిలో మీటర్లు దూరం సాగిన పరామర్శ యాత్ర గీసుగొండ మండలం మరియపురం వరకు చేరింది. అక్కడి ఫాతిమా కాన్వెంట్ ఆవరణలో షర్మిల బస చేశారు. గురువారం ఉదయం నుంచే భారీగా జన స్పందన ఉండడంతో షర్మిల యాత్రకు ఎక్కువ సమయం పట్టింది.

 

 అంతా మంచే జరుగుతుంది..


 కష్టాలు కొద్ది రోజులే ఉంటాయని, మంచి రోజులు మళ్లీ వస్తాయని ధైర్యం చెప్పారు. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన తీగల చిరంజీవి కుటంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. అరగంటకుపైగా చిరంజీవి కుటుంబసభ్యులతో ముచ్చటించారు. చిరంజీవి సోదరుడు అనిల్ ఏడు నెలల కుమారుడు మన్విత్‌ను షర్మిల తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించారు. అనంతరం వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్లి షర్మిల వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సక్కుబాయి కుమారుడు భాస్కర్.. వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి అనుభవాలను షర్మిలకు వివరించారు. దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘మా అత్తకు వైఎస్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చేది. ఇప్పడు రావడం లేదు’ అని కొమురయ్య భార్య రాధ షర్మిలకు చెప్పారు. ‘కష్టాలు కొద్ది రోజులే ఉంటాయి. మనకు అంతా మంచే జరుగుతుంది’అంటూ కాశిబుగ్గలోని నాగవెళ్లి వీరస్వామి కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. ఉర్సులోని రామ సుదర్శన్ ఇంటికి షర్మిల వెళ్లారు. కన్నీటి పర్యంతమైన రామసుదర్శన్ భార్య భారతను దగ్గరకు తీసుకుని షర్మిల ఓదార్చారు. షర్మిలను రామా సుదర్శన్ ఇంటికి వచ్చే సమయంలో కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఆమెకు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ‘మీకు అండగా మా కుటుంబం ఉంటుంది. ధైర్యంగా ఉండండి’ అని గీసుగొండ మండలం మరియపురంలో బిట్ల సత్తెమ్మను షర్మిల పరామర్శించారు. అనంతరం ఊకల్‌హవేలీలో ఓదెల సరస్వతి ఇంటికి వెళ్లారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక డాబాపై నుంచి దూకి చనిపోయిన ఓదెల స్వామి విషయాన్ని తెలుసుకుని షర్మిల చలించిపోయారు.

 

 శుక్రవారం నాలుగు కుటుంబాలకు పరామర్శ

 జిల్లా మొదటి పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం నాలుగు కుటుంబాలను పరామర్శించనున్నారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ఉదయం పరామర్శిస్తారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్తారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇస్తారు. శుక్రవారం పరామర్శ యాత్ర 67 కిలో మీటర్లు సాగనుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top