‘హక్కులు’ కాపాడిన నేత వైఎస్: షర్మిల

‘హక్కులు’ కాపాడిన నేత వైఎస్: షర్మిల


నేటితో నల్లగొండ జిల్లాలో పూర్తికానున్న తొలిదశ యాత్ర

* ఆరో రోజు సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు పరామర్శ

* ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యతను ఆయన గుర్తించారు

* రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అందరికీ న్యాయం చేశారు

* వైఎస్ పాలనను ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచన

* సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు పరామర్శ

* వైఎస్ కుటుంబం తోడుగా ఉంటుందని భరోసా కల్పించిన వైఎస్ జగన్ సోదరి

* ముక్కుడుదేవులపల్లిలో మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించిన షర్మిల


 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘రాజ్యాంగం దేశ పౌరులందరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఇచ్చింది. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. చాలా మంది రాజకీయ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడగలరు.. కానీ ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే రాజ్యాంగం ఆత్మను అర్థం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేశారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల... 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఆనంద విద్యా మందిర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యతను వైఎస్ గుర్తించారని చెప్పారు. ఆయన ప్రభుత్వం ప్రతి ఒక్కరి హక్కులను కాపాడిందని... రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేసిందని తెలిపారు. వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. భారత పౌరులుగా ఈ దేశానికి చేస్తున్న సేవను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భారతమాతకు చేస్తున్న సేవగా గుర్తెరగాలని కోరారు. అనంతరం ఆమె పాఠశాల విద్యార్థులు నిర్వహించిన  పరేడ్‌లో పాల్గొని వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

 

 ఆరు కుటుంబాలకు పరామర్శ..

 పరామర్శ యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ఆరో రోజు సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలను పరామర్శించారు. ఉదయం సూర్యాపేటలోని ఏవీఎం స్కూల్‌లో జరిగిన గణతంత్ర వేడుకలలో షర్మిల పాల్గొన్నారు. తర్వాత పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి బయలుదేరిన ఆమె... మార్గమధ్యలో సింగారెడ్డిపాలెంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా వందనం చేశారు.

 

 ఆ తర్వాత అనంతారం వెళ్లి దామర్ల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి దురాజ్‌పల్లి మార్గంలో జాతీయ రహదారి మీదుగా చివ్వెంల మండలం హున్యానాయక్ తండాకు వెళ్లి బానోతు ముకుంద కుటుంబాన్ని కలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు(ఎస్) మండలం నశింపేటకు వెళ్లి నర్రా లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు. నెమ్మికల్లు సమీపంలో భోజనం పూర్తి చేసుకుని ముక్కుడు దేవులపల్లికి వెళ్లి... కుంచం ఎల్లమ్మ కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడి నుంచి కందగట్లకు చేరుకుని... కుషనపల్లి రాములు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

 

 ఈ గ్రామంలో షర్మిలకు ఘన స్వాగతం లభించింది.  గ్రామస్తులు ఊరి ప్రారంభం నుంచే రంగు రంగుల ముగ్గులు వేసి.. రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఆమెను ఆహ్వానించారు. గ్రామంలో వెళుతుండగా వైఎస్సార్ అభిమాని పూతనపల్లి చెన్నయ్య కుమార్తె కలకొండ ప్రియాంక, రమేష్ దంపతులు షర్మిలను ఆపి... తమ 23 రోజుల కుమార్తెకు పేరు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో ఆ పాపకు షర్మిల.. ‘విజయ’ అని పేరు పెట్టారు. అనంతరం ఏనుబాములలో వర్రె వెంకులు కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో షర్మిల పరామర్శించిన ఆరు కుటుంబాలూ... రాజన్న బిడ్డకు సాదర స్వాగతం పలికాయి. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన తమ కుటుంబ పెద్దను గుర్తుంచుకుని, ఐదున్నరేళ్ల తర్వాత కూడా తమను కలుసుకునేందుకు వచ్చిన షర్మిలను చూసి ఆ కుటుంబాల సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి కుటుం బాన్ని పరామర్శించిన షర్మిల.. వారందరికీ ధైర్యం చెబుతూ... వారికి వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

 బారులు తీరిన ప్రజలు...

 సూర్యాపేట నియోజకవర్గంలో షర్మిల యాత్రకు భారీ స్పందన కనిపించింది. పర్యటన మార్గంలో ప్రజలు రోడ్డు పక్కన బారులు తీరి ఆమెను స్వాగతించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తుండగా... ఆమెను చూసేందుకు ఆ ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించి వెళుతున్న షర్మిలకు శివమాలధారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పునర్నిర్మించుకున్న పురాతన మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించాలని వారు కోరగా... షర్మిల ఆ దేవాలయాన్ని ప్రారంభించారు. కాగా మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలో మూడు కుటుంబాలను పరామర్శించడంతో షర్మిల పరామర్శ యాత్ర తొలివిడత ముగియనుంది.

 

సోమవారం యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, పార్టీ కార్యదర్శులు జి.రాంభూపాల్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, కొమురం వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులు ఇరుగు సునీల్, షర్మిలా సంపత్, బంగి లక్ష్మణ్, యువజన విభాగం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 

 ప్రజల కలలు నెరవేరాలి: పొంగులేటి

 60 ఏళ్ల పోరాటం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొంటున్న తొలి గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సూర్యాపేటలోని ఏవీఎం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేర్చేలా పాలకులు ప్రయత్నించాలని కోరారు.

 

 వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు

 ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం షర్మిల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కొణిజర్ల మండలం ఉప్పలచెలక సర్పంచ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాదావత్ సైదులు, నాయకులు గగులోతు నర్సింహారావు, జాల ఆంజనేయులు, బూక్యా మాన్‌సింగ్, గుడివాడ వెంకటేశ్వర్లు, బూక్యా బాలు తదితరులు ఉన్నారు. పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా నేతలు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, మధిర ఎంపీపీ వేమిరెడ్డి శేఖర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top