కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.. : షర్మిల

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.. : షర్మిల


* ఏడోరోజు పరామర్శ యాత్రలో షర్మిల భరోసా  

* మూడు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ తనయ

* నల్లగొండ జిల్లాలో ముగిసిన మొదటి విడత పరామర్శ యాత్ర

* ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను కలుసుకున్న షర్మిల


 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ నాయకురాలు షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మొదటి విడత ‘పరామర్శ యాత్ర’ ముగిసింది. ఏడోరోజు మంగళవారం ఆమె సూర్యాపేట నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను కలవడంతో మొదటి విడత యాత్ర పూర్తయింది. 7 రోజుల పాటు జరిగిన యాత్రలో షర్మిల జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పర్యటించి 30 కుటుంబాలను పరామర్శించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్న షర్మిల వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ఆ కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

 చివరి రోజు మూడు కుటుంబాలు..

జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటించారు. చివ్వెంల మండలంలోని వాల్యాతండాలో నునావత్ లక్ష్మి కుటుంబాన్ని, ఆ తర్వాత ఆత్మకూరు (ఎస్) దుబ్బతండాలోని అజ్మీరా గంసీ కుటుంబాన్ని, చివ్వెంల మండలం కుడకుడలోని శేర్ల రాములు కుటుంబాన్ని ఆమె కలుసుకున్నారు. చివరి రోజు యాత్రకు కూడా మంచి స్పందన కనిపించింది. పరామర్శ కుటుంబాల వద్ద, గ్రామాల వెంట ప్రజలు పెద్దఎత్తున షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, అమృతాసాగర్, జి.రాంభూపాల్‌రెడ్డి, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, ముస్తాబ్ అహ్మద్, ప్రపుల్లారెడ్డి, జార్జి హెర్బర్ట్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా నేతలు పిట్ట రాంరెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, దండా శ్రీనివాసరెడ్డి, పచ్చిపాల వేణుయాదవ్ తదితరులున్నారు.

 

 అందరికీ కృతజ్ఞతలు: పొంగులేటి

 నల్లగొండ జిల్లాలో జరిగిన పరామర్శ యాత్రకు సహకరించిన అందరికీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర మొదటి విడత ముగిసిన అనంతరం కుడకుడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలసి మాట్లాడారు. షర్మిల ఎక్కడకు వెళ్లినా ఆమె తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి, వారికి జరిగిన లబ్ధి గురించి ప్రజలు ఆమెకు వివరించారని చెప్పారు. వైఎస్‌లాంటి పరిపాలన ఆయన కన్నా ముందు గానీ, ఆయన తర్వాత గానీ ఎవరూ చేయలేరని ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తమకు పింఛన్లు రాలేదని, తాగునీరు లేదని, ఇళ్లు లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇబ్బందిగా ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పొంగులేటి చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top