డబుల్ బెడ్రూం ఇళ్లలో భాగస్వామ్యం

డబుల్ బెడ్రూం ఇళ్లలో భాగస్వామ్యం - Sakshi


టాటా గ్రూప్ అంగీకారం

హైదరాబాద్‌లో టాటా ఏఐజీ సెంటర్

రక్షణ, ఏరోస్పేస్‌లో పెట్టుబడులకు ఆసక్తి

ముంబైలో సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ భేటీ

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతోనూ సమావేశం

రాష్ట్రానికి అంబానీ కితాబు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ సంస్థలు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో టాటా-ఏఐజీ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ముం బైకి వెళ్లిన రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో విడివివిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూపు ఆసక్తి కనబరిచింది.


టీ హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌కు టాటా క్యాపిటల్ నుంచి ఆర్థిక సహకారం అందించేందుకు అవగాహన కుదిరింది. అంబానీతో భేటీ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రి కేటీఆర్ వివరించారు. పరిశ్రమల అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యుత్ ప్రణాళికలను అంబానీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి పథకాన్ని నిర్దిష్ట గడువుతో పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, వాటర్ గ్రిడ్ పూర్తి కాకుంటే వచ్చే ఎన్నికలకు వెళ్లబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను అంబానీకి వివరించారు.


తెలంగాణ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తోందని, దానికి అనుగుణంగా ఆచరణ కనిపిస్తోందని అంబానీ కితాబిచ్చారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరిస్తున్న ప్రణాళికలను, కార్యాచరణ విధానాన్ని మెచ్చుకున్నారు. ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు తమ వద్ద ప్రణాళికలున్నాయని, త్వరలోనే ప్రభుత్వం పెద్దఎత్తున వివిధ రంగాల్లో పని చేస్తామని మంత్రికి తెలిపారు. కేటీఆర్ వెంట ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top