శంషాబాద్ విమానాశ్రయం మా వల్లే వచ్చింది: బాబు

శంషాబాద్ విమానాశ్రయం మా వల్లే వచ్చింది: బాబు - Sakshi


హైటెక్ సిటీని తానే కట్టించానని, అసలు ఏపీకి ఐటీని తీసుకొచ్చిందే తానని, హైదరాబాద్ నిర్మాణం సగం తనవల్లే అయ్యిందని పదే పదే చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన గొప్పలు చాటుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం టీడీపీ వల్లే వచ్చిందని ఆయన తాజాగా అన్నారు. దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తామేనని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తీర్మానాన్ని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.



ఈ దీక్షకు చంద్రబాబు నాయుడు హాజరై మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ను ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు మార్చే అవకాశం ఉన్నా  సంప్రదాయాన్ని అనుసరించి పేరు మార్చలేదని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెడతామని 2009లోనే చెప్పామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న నేతలు ఎన్టీఆర్ వల్లే రాజకీయాల్లోకి పైకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. పేదవారి హక్కుల్ని కాపాడింది ఎన్టీఆరేనని ప్రశంసించారు.



కేసీఆర్, జానారెడ్డిలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని చంద్రబాబు అన్నారు. నూతన రాజధానిలో కొమురం భీం, చాకలి అయిలమ్మ, పీవీ నరసింహారావు పేర్లు గుర్తిండిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ శాసనసభలో టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టొద్దంటూ తీర్మానం చేసి తెలుగు ప్రజలను అవమానించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన... ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top