జుట్టు కత్తిరించి.. బట్టలూడదీసి

జుట్టు కత్తిరించి.. బట్టలూడదీసి - Sakshi


- మహిళలపై అకృత్యం

- పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం




 హత్నూర : సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇద్దరు మహిళలను చిత్రహింసలకు గురిచేసి హింసించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు గ్రామానికి చెందిన బాధితులు చాకలి అనసూజ, చాకలి లక్ష్మి (నిందితుల్లో ఒకడైన అశోక్ మేనత్త అనసూజ, పెద్దమ్మ లక్ష్మి) మాటల్లోనే.. ‘ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన బడెంపేట నరసింహులు(40) హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన చాకలి అడవయ్య, చాకలి అశోక్ కేసులో నిందితులుగా తెలపడంతో అప్పట్లో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే వారు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చినా గ్రామానికి రాలేదు.



అవిడయ్య, అశోక్ ఆచూకీ తెలపాలని హతుడి బంధువులు బెదిరింపులకు దిగారు. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన మా ఇళ్లకు వచ్చి మమ్ములను కొట్టి ఈడ్చుకుంటూ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడే మా చీరలు ఊడదీసి వాటితోనే అక్కడి స్తంభానికి కట్టేశారు. అవిడయ్య, అశోక్ ఆచూకీ తెలపాలని రాత్రంతా కొట్టారు. దాహం వేస్తోందంటే కొందరి మూత్రం డబ్బాలో పోసి వాటిని నీరంటూ బలవంతంగా తాపించారు. అంతటితో ఆగక  మా జుట్టును కత్తిరించి ఆలయం వెనుక వాటికి నిప్పు పెట్టించారు. ఆ రోజంతా నిందితుల ఆచూకీ తెలపాలంటూ కొడుతూనే ఉన్నారు.



అదే రోజు రాత్రి నా భర్త(లక్ష్మి) చాకలి యాదయ్య విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం అందించారు. అయినా వారిని నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరుసటి రోజు ఉదయం(ఆగస్టు 13) మా ఇళ్లకు చేరుకుని ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కుతుంటే సదరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ రోజు మధ్నాహ్నం గ్రామంలో ఎవరి కంటా కనపడకుండా సంగారెడ్డికి చేరుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఇందుకు స్పందించి ఎస్పీ బాధితులపై చర్యలు తీసుకోవాలని హత్నూర పోలీసులను అప్పట్లో ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది.



ఈ నెల 13 నుంచి సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేకు హాజరయ్యేందుకు కొన్యాలకు వెళ్లాలని నిర్ణయించుకుని హత్నూర పోలీసులను సంప్రదించాం. వారు వెళ్లమని సలహా ఇచ్చారు. 18న రాత్రి హత్నూరలోని బంధువుల ఇంటిలో ఉండి 19వ తేదీ ఉదయం కొన్యాలకు వెళ్లాం. మమ్ములను చూసిన గ్రామానికి చెందిన మిహ ళలు బూతులు తిట్టారు’ అని విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నారు.

 

కేసు నమోదు చేశాం

కొన్యాల గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి, చాకలి అనసూజల చిత్ర హింసలకు గురి చేసిన విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కొసాగుతోంది.  - రాంరెడ్డి, సీఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top