కుర్చీలాట


షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సీటు కదలనుందా.?.. ఇంతకాలం నియోజకవర్గ కేంద్రంలో పరువు నిలుపుకున్న కాంగ్రెస్‌ పార్టీకి మరోమారు గట్టిదెబ్బ తగలనుందా?.. కాంగ్రెస్‌లో సొంత పార్టీ కౌన్సిలర్లే పనులు జరగడం లేదనే అసంతృప్తే ఇందుకు కారణామా అనే ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే చెపుతున్నాయి. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్టణంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ నాయకులు ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన చైర్మన్‌ సీటుపై టీఆర్‌ఎస్‌ పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుకున్నట్టుగానే అధికార పార్టీ దూకుడు ప్రారంభిస్తే చైర్మన్‌ పీఠం గులాబీ చేతికి చిక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.    



షాద్‌నగర్‌ క్రైం : షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 23 వార్డులున్నాయి. గడచిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 23 వార్డులకు గాను ఎంఐఎం ఒకటి, టీఆర్‌ఎస్‌ ఒకటి, ఇండిపెండెంటెండ్‌ అభ్యర్థులు ఆరు వార్డుల్లో గెలవగా మిగతా వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. దీంతో మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు  కాంగెస్‌ కౌన్సిలర్‌ అగ్గనూరి విశ్వం మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయపథంలో నడచిన కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది.



 షాద్‌నగర్‌ అసెంబ్లీ స్థానం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి పట్టణంలో చైర్మన్‌ పదవి ఒక్కటే చెప్పుకోదగ్గదిగా మిగిలింది. ఇదిలా ఉండగా తాజాగా పదవ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ భ్రమరాంబ మృతిచెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే మున్సిపల్‌ పరిధిలో పనులు జగరడం లేదని కొందరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఎడమొహం పెడమొహంతో ఉండగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన కౌన్సిలర్లు అధికార పార్టీతో మంచిగా ఉన్నారు.



 మున్సిపల్‌ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు ముగియడానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చైర్మన్‌ పీఠంపై దృష్టిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. 23వార్డుల్లో ఒక వార్డులో మాత్రమే విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ కాలక్రమేణా తన బలాన్ని పుంజుకుంది. కౌన్సిలర్‌ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారనే చర్చ బాహాటంగానే వినిపిస్తుంది.



1965 మున్సిపల్‌ చట్టం సెక్షన్‌ 46 ప్రకారం మూడు సంవత్సరాలు దాటిన తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంటుంది. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ కార్యవర్గం ఏర్పడి వచ్చే మే నాటికి మూడు సంవత్సరాలు గడుస్తుంది. దీంతో వార్డు కౌన్సిలర్‌ గెలుపుతో ఉత్సాహంలో ఉన్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకునేలా వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉన్న కౌన్సిలర్లలో అసంతృప్తితో ఉన్న ముగ్గురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ వైపు వస్తారనే ధీమాలో ఆ పార్టీ నాయకులున్నట్లు సమాచారం. మున్సిపల్‌ చట్టం ప్రకారం అవిశ్వాసం పెట్టినపుడు బలపరీక్షలో ఆయా పార్టీలు విప్‌ జారీచేస్తే అందుకు అనుగుణంగానే ఓటు వేయాలి. లేదంటే కలెక్టర్‌ వారిని శాశ్వతంగా పదవిలో నుండి తొలగించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్‌ మున్సి పల్‌లో రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top