కేసీఆర్ మహాత్ముడా ?

కేసీఆర్ మహాత్ముడా ? - Sakshi


హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మహాత్ముడు అంటూ టీఆర్ఎస్ ప్లీనరీలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పొగడ్తలతో ముంచెత్తడంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో గాంధీ భవన్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ...  కేసీఆర్‌ను మహాత్ముడు అని ఎందుకు పొగిడారంటూ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని ప్రశ్నించారు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసినందుకు గాంధీజీని మహాత్ముడు అని మనమంతా కీర్తించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. కానీ దళితుడినే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పి... దళితులకు దక్కాల్సిన సీఎం కుర్చీని కబ్జా చేసినందుకు మహాత్మా అని పొగుడుతున్నారా? రాష్ట్ర మంత్రివర్గంలోని కీలక పదవులన్నీ కుటుంబసభ్యులకే కట్టబెట్టినందుకు మహాత్మా అంటున్నారా? ..  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహ్మమద్ అలీ షబ్బీర్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను మహాత్మా అంటూ నిజమైన మహాత్ములను అవమానిస్తున్నారని విమర్శించారు.



తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని టీఆర్‌ఎస్ ప్లీనరీ తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆరోపించారు. అసలే కరువు, ఆపై అకాలవర్షాలతో పంట నష్టపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్లీనరీలో హామీ వస్తుందని ఆశించినామన్నారు. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి కనీస ప్రస్తావన కూడా లేకుండా ప్లీనరీని పొగడ్తలతో ముగించారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్రంలో 939 రైతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటే ప్లీనరీలో ఫైవ్‌స్టార్ హోటళ్లలోని మెనూతో ప్లీనరీ నిర్వహించుకున్నారని అన్నారు.


ఆత్మహత్యలను పట్టించుకోకుండా చికెన్లు, మటన్లు, నాటుకోళ్లు, తలకాయ కూర, బోఠీ ఫ్రై వంటి విలాసాలతో సభ పెట్టుకుని రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ చేసిన లెక్కలేనన్ని వాగ్దానాల చేసి... వాటిని అమలు చేయకుండా వెనక్కి తగ్గారన్నారు.  ప్లీనరీలో చెప్పిన మాటలు కూడా నమ్మలేమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాల అమలుపైనా ప్లీనరీలో ప్రస్తావించలేదన్నారు.



ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క విద్యుత్‌ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేయలేదని... తెలంగాణ ఏర్పాటు చేసిన ఘనతతోపాటు తెలంగాణలో కరెంటు సరఫరా ఘనత పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీదే అని ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్‌లో అవినీతికి సంబంధించిన ప్రశ్నలకు, రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీకోసం డిమాండు చేసినా సీఎం కేసీర్ ప్లీనరీలోనూ సమాధానం చెప్పలేదని షబ్బీర్ అలీ విమర్శించారు.


రైతుల ఆత్మహత్యలపై మానవహక్కుల సంఘం తప్పుబట్టినా ప్రభుత్వ తీరులో మార్పురాకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న ద్రోహులను మంత్రివర్గంలో చేరినవారి ధోరణి, కేసీఆర్ కుటుంబసభ్యుల తీరుతో తెలంగాణ కోసం నిజంగా త్యాగాలు చేసినవారి కుటుంబాలు తీవ్ర క్షోభకు గురవుతున్నాయని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top