సొరంగం కూలి ఏడుగురి దుర్మరణం

సొరంగం కూలి ఏడుగురి దుర్మరణం - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఘోరం

 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/సిరిసిల్ల/ ఇల్లంతకుంట: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు కూలడంతో ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఇందులో ఆరుగురు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కాగా, మరొకరిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లో బుధవారం ఉదయం సొరంగం(అండర్‌ టన్నెల్‌) పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ కాళేశ్వరం పథకం ప్యాకేజీ–10లో భాగంగా పనులు జరుగుతున్నాయి. సాగునీటిని తరలించేందుకు గుట్టలు అడ్డు ఉండటంతో సొరంగం తవ్వుతున్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

 

ఎలా జరిగింది..?

ఉదయం 9 గంటలకు సొరంగంలోకి 27 మంది కూలీలతో పాటు ఇంజనీర్లు దిగారు. 150 మీటర్ల లోతులో కిలోమీటర్‌ దూరంలో బండరాళ్లను ఎత్తిపోసే పనులు పూర్తి చేశారు. భోజనం చేసేందుకు ఇంజనీర్లు, కొందరు కూలీలు తిరిగి వస్తుండగా.. సొరంగం పైభాగంలోని పది మీటర్ల పొడవుతో ఉన్న బండపొర ఒక్కసారి కూలింది. బండలు మీదపడడంతో అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన జార్ఖండ్‌లోని రాంగఢ్‌ జిల్లా బర్ఖాంగకు చెందిన పూరన్‌సింగ్‌(40), అదే రాష్ట్రంలోని ముస్బానికి చెందిన బుడాన్‌ సోరెన్‌(38)లను హుటాహుటిన కరీంనగర్‌ తరలించారు. అయితే బుడాన్‌ సోరెన్‌ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతుల్లో ఆరుగురు కూలీలు జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు. మరొకరిని భూపాల పల్లి జిల్లా ములుగుకు చెందిన యాసం సందీప్‌(25)గా గుర్తించారు. ప్రమాదం సంగతి తెలియగానే కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ రవివర్మ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్‌ సందర్శించారు. 

 

కూలిందా.. పేలిందా..?

సొరంగం పైకప్పు కూలిందని నీటిపారుదల శాఖ ఈఈ ఆనంద్‌ తెలిపారు. అయితే సొరంగం పైకప్పు ప్రమాదవశాత్తు కూలిం దా? లేదా సొరంగంలో బండలను జిలెటిన్లతో పేల్చినప్పుడు ఈ ఘటన జరిగిందా అన్నది అంతు చిక్కడం లేదు. మృతుల శరీరభాగాలు మొత్తం నుజ్జునుజ్జయి గుర్తు పట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. బండలను పేల్చే క్రమంలో పైభాగం కంపించడం వల్లే కూలి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం కారణంగానే దుర్ఘటన చోటుచేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

ఉద్రిక్తతల మధ్య పోస్టుమార్టం

మృతదేహాలకు తీవ్ర ఉద్రిక్తతల మధ్య బుధవారం రాత్రి పోస్టుమార్టం జరిగింది. కరీంనగర్‌ ఆసుపత్రి వద్ద కాంగ్రెస్, వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, ఆరెపల్లి మోహన్, మృత్యుంజయం తదితర నేతలు మృతుల కుటుంబాలకు ఇన్సూరెన్స్‌తోపాటు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు పోస్టుమార్టం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లతో ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తూ నష్టపరిహారం విషయమై వారితో చర్చించారు. జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డిలు కూడా చేరుకొని పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యులకు సూచించారు.



కాంగ్రెస్‌ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ములుగుకు చెందిన సందీప్‌ కుటుంబీకులు అక్కడికి చేరుకోవడంతో వారితో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదుతో కాంట్రాక్టు యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చివరికి కరీంనగర్‌ కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. ఇన్సూరెన్స్, నష్టపరిహారం కలిసి రూ.20 లక్షలు అందజేస్తామని, మృతదేహాలను పోస్టు మార్టం తర్వాత వారి స్వగ్రామాలకు పంపి స్తామని తెలపడంతో ఉద్రిక్తతకు తెరపడింది.

 

సీఎం దిగ్భ్రాంతి

కాళేశ్వరం పనుల్లో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



మృతులు వీరే.. 


జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భమ్‌ జిల్లా జందా గ్రామానికి చెందిన హికిమ్‌ హండ్సా (26), సిందేగా జిల్లా రాంజోల్‌ గ్రామానికి చెందిన గాట్మా టోప్నో, ముస్బానికి చెందిన బుడాన్‌ సోరెన్‌(38), ఒడిశాలోని గంజాం జిల్లా బగ్‌బన్‌పూర్‌కు చెందిన రామకృష్ణన్‌ సాహు(35), ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా సౌత్‌పూర్‌కు చెందిన హరిచంద్‌ నేతన్‌(35), పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌ జిల్లాకు చెందిన జితేందర్‌కుమార్‌(25), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన యాసం సందీప్‌(25).


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top