రంగుల్లో ‘పింఛన్లు’

రంగుల్లో ‘పింఛన్లు’


 సెప్టెంబర్‌లో పెన్షన్లన్నీ రద్దు.. కొత్తగా అక్టోబర్‌లో మంజూరు

 

 సాక్షి, హైదరాబాద్:

 అర్హులకు మాత్రమే సామాజిక పింఛన్లు అందేలా చూడాలన్న లక్ష్యంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని రకాల సామాజిక భద్రతా పింఛన్లను సెప్టెం బర్‌లో రద్దు చేయాలని నిర్ణయించింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులు, అంగవైకల్యం కేటగిరీల కింద మొత్తం 30.87 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. అయితే ఇందులో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికిపైగా పెన్షన్లు పొందుతున్నట్లు సర్వే ల్లో వెల్లడికావడంతో వీటన్నింటినీ రద్దు చేసి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడం కోసం వారం పది రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నూతన రాష్ట్రంలో తీసుకొస్తున్న ఈ పథకానికి కొత్త పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పథకం పేరును ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

 

 పారదర్శకంగా ఎంపిక...

 

 పింఛన్లు పొందడానికి అర్హులైనవారిని ఎంపిక చేసే సమయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు ముగ్గురు అధికారులు తనిఖీ చేస్తారని, అయినా బోగస్ పెన్షన్లు వస్తే.. ఆ ముగ్గురు అధికారులను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లోనే స్పష్టం చేయనుంది. కొత్త పెన్షన్ కార్డులను అక్టోబర్‌లో మంజూరు చేస్తారు. పెన్షన్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల పేర్లను గ్రామసభల్లో చదివి వినిపిస్తారని, అనంతరం ఆయా గ్రామ సర్పంచ్‌ల చేతుల మీదుగా కొత్త కార్డులను పించనుదారులకు ఇప్పిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే వృద్ధాప్య పింఛనుదారుల వయసు నిర్ధారణకు డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోరని, వారి ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న వయసును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించాయి. కాగా, కొత్తగా ఇచ్చే పెన్షన్లను వారం రోజులపాటు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పింఛనుదారులకు ఏడు వేర్వేరు రంగుల్లో ఉండే కార్డులను మంజూరు చేసి, వారంలో ఒక్కోరోజు ఒక్కో రంగు కార్డువారికి పింఛను అందజేస్తారు. దీనివల్ల గ్రామాల్లో ఎక్కడా పించన్ల కోసం తొక్కిసలాట జరగదని, అంతేకాకుండా వచ్చిన వారందరికీ పెన్షన్ అందేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారవర్గాలు వివరించాయి.

 

 ఇవీ నిబంధనలు...

 

 కొత్త పెన్షన్లకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. పించనుదారుల పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేటుగా ఏ ఉద్యోగం చేస్తున్నా, ట్యాక్సీ వంటి వాహనాలు నడుపుతున్నా పెన్షన్ ఇవ్వరు. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పించను ఇచ్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆధార్‌కార్డును అనుసంధానం చేయడంతోపాటు చేతివేలి గుర్తులను తీసుకుంటారు. వృద్ధుల చేతివేలి గుర్తులు పడని పక్షంలో కళ్ల ఐరిస్ తీసుకోనున్నారు. 65 సంవత్సరాల వయసు దాటినవారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయనున్నారు. కేంద్రం 60 ఏళ్ల వయసున్నవారికి వృద్ధాప్య పించన్లు అమలు చేయాలంటున్నా.. తెలంగాణలో భారీస్థాయిలో పెన్షన్లు ఇస్తున్నందున అది సాధ్యం కాదని అధికారులు తేల్చారు. జనాభా లెక్కల ప్రకారం మండలాల్లో ఉన్న వృద్ధుల సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే.. కంప్యూటర్ ఆ పేర్ల నమోదుకు అంగీకరించకుండా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. కాగా, ఇకపై పించన్లను పోస్టాఫీసుల్లో లేదా అల్ట్రాబ్యాంకుల్లో, కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top