అసైన్డ్ భూములు అమ్మినా..కొన్నా నేరమే!


కొండపాక: అసైన్డ్ భూములు అమ్మినా, కొన్నా చట్ట ప్రకారం నేరమని జాయింట్ కలెక్టర్ శరత్ హెచ్చరించారు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని అసైన్డ్ భూములను ఆయన గురువారం సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి పరిశీలించారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని 158, 159, 160, 161, 163 సర్వేనెంబర్లలోని అన్యాక్రాంతమైన  58 ఎకరాల అసైన్డ్‌భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి వివరాలపై స్థానిక తహశీల్దార్ పరమేశ్వర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తిమ్మారెడ్డిపల్లి శివారులోని 58 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో భూమి లేని నిరుపేదలకు కేటాయించిందన్నారు.



ప్రస్తుతం ఈ భూమి నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. వెంటనే ఈ భూమిని స్వాధీనం చేసుకొని కడీలు పాతించాలని ఆయన తహశీల్దార్‌ను ఆదేశించారు. సిద్దిపేట నుంచి జిల్లా సరిహద్దులోని వంటిమామిడి గ్రామం వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల లోపలి వరకు ఉన్న ప్రభుత్వ, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను, ఇతరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వేచేపట్టి స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వభూములపై ఎన్ని లావాదేవీలు జరిగినా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు.



కబ్జా అయిన వాటి వివరాలు ఇవ్వాలి

అన్యాక్రాంతమైన ప్రభుత్వ, అసైన్డ్‌భూములపై పత్రికల్లో వచ్చే కథనాలపై వెం టనే స్పందించి చర్యలు తీసుకుంటామని జేసీ శరత్ తెలిపారు.   మండలంలోని కుకునూర్‌పల్లిలోని సబ్ మార్కెట్‌యార్డులో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ శరత్ సందర్శించారు.

 

అర్హులకే సంక్షేమ పథకాలు

సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలను అందించే ఉద్దేశంతోనే ముందుకు పోతోందని జేసీ శరత్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ శరత్ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్ల కోసం 4.10 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. వాటిలో ఇప్పటి వరకు 3.75 లక్షలను పరిశీలించడం జరిగిందన్నారు.



పరిశీలన ప్రక్రియ అనంతరం అర్హులైన జాబితాను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసి నవంబర్ 8 నాటికల్లా తుది జాబితాను సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ. 1500, వితంతువులు, వృద్ధులకు, ఇతర పింఛన్లకు రూ. వెయ్యి చొప్పున అందించనుందన్నారు. మరోవైపు కుటుంబ ఆహార భద్రత కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని వాటిలో 4 లక్షల దరఖాస్తులను పరిశీలించామన్నారు. నవంబర్ 15 నాటికి ఆహార భద్రత కార్డుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. జనవరిలో జిల్లా ప్రజలందరి చేతుల్లో కొత్త కార్డులు ఉంటాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top