చార్మినార్‌కు సెల్ఫీ టెర్రర్‌!

చార్మినార్‌కు సెల్ఫీ టెర్రర్‌! - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌.. హైదరాబాద్‌ నగర సంతకం. ఆ చారిత్రక కట్టడం పైనుంచి నగర సౌందర్యాన్ని చూస్తుంటే ఆ అనుభూతే వేరు. పైఅంతస్తు పిట్టగోడకు అనుకుని నిలబడి, నగిషీలు చెక్కిన గోడలమధ్య నుంచి భాగ్యనగర అందాలు వీక్షించాలని పర్యాటకులు తహతహలాడుతుంటారు. కానీ కొత్తగా ముదిరిన సెల్ఫీల పిచ్చి కారణంగా చార్మినార్‌పై ‘అడ్డుగోడలు’ వెలియనున్నాయి. యువత, కొందరు పర్యాటకులు పిట్టగోడలపై కూర్చుని, పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో.. ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పర్యాటకులు పిట్టగోడల వరకు వెళ్లకుండా స్టీల్‌ కడ్డీలతో అడ్డుగోడలా ఏర్పాటు చేస్తున్నారు.



ప్రమాదాన్నీ లెక్కచేయకుండా..

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. సరదాగా మొదలై ఇప్పుడు వణుకుపుట్టిస్తున్న అంశమిది. ఈ మోజులో ప్రమాదకర సాహసాలకు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నవారెందరో ఉన్నారు. ఇప్పుడీ సెల్ఫీ దడ చార్మినార్‌ను చుట్టుముట్టింది. చార్మినార్‌కు వస్తున్న యువత సెల్ఫీ తీసుకునేందుకు కట్టడం పిట్టగోడపైకి ఎక్కుతుండటం అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ క్షణాన ఎవరు ప్రమాదానికి గురవుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచినా ఫలితం లేకపోవటంతో.. ఇక ముందు పర్యాటకులను మొదటి అంతస్తులో కట్టడం అంచుల వరకు వెళ్లకుండా నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టెయిన్‌లెస్‌ స్టీలు పైపులతో మూడడుగుల ఎత్తుతో బారికేడ్లు నిర్మిస్తున్నారు. నెల రోజుల్లో అది పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు.



రక్షణ సిబ్బందితో ఘర్షణ..

చార్మినార్‌ను సగటున రోజుకు ఐదున్నర వేల మంది సందర్శిస్తుంటారు. అందులో కనీసం 1,500 మంది సెల్ఫీల కోసం హడావుడి చేస్తున్నారు. ఇంతమందిని నియంత్రించటం పరిమిత సంఖ్య లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది వల్ల కావట్లేదు. గతంలో మొదటి అంతస్తులో కేవలం నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉండేవారు. సెల్ఫీ ఆగడాలు పెరిగిపోవడంతో వారి సంఖ్యను ఆరుకు పెంచటంతోపాటు పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఉద్యోగులు నలుగురిని కూడా నియమించారు. కానీ గుంపులుగా వచ్చే సందర్శకులు సిబ్బందితో ఘర్షణ పడి మరీ పిట్టగోడలెక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు.



చెక్కతో చేసిన బారికేడ్లు ఏర్పాటు చేసినా.. సందర్శకులు వాటిని జరిపి మరీ ముందుకెళుతున్నారు. కొందరు జారి కిందపడిపోయే దాకా వెళ్లింది. సిబ్బంది సందర్శకులను గట్టిగా నియంత్రించే ప్రయత్నం చేస్తుండటంతో ఘర్షణలు జరిగి పోలీసుస్టేషన్‌ వరకు వెళ్తున్నాయి. దీంతో అ«ధికారులు విషయాన్ని ఢిల్లీలోని పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చార్మినార్‌ వారసత్వ కట్టడం కావడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతివ్వలేదు. కానీ గోడలకు అనుసంధానం చేయకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించారు. దీంతో స్టీలు పైపులతో బారికేడ్‌ ఏర్పాటు చేస్తున్నారు.



ప్రమాదాలూ.. నేరాలూ..

* ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ కుటుంబంలోని నలుగురు 1986లో చార్మినార్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో సందర్శకులకు పైకి ఎక్కేందుకు అనుమతి రద్దు చేశారు. తిరిగి 2000లో అనుమతి పునరుద్ధరించినా మొదటి అంతస్తుకే పరిమితం చేశారు.

* 2006లో ఓ గృహిణి కట్టడంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

* 2007లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా తోటి పర్యాటకులు కాపాడారు.

* 2009లో 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు కట్టడంపై నుంచి తోసేయటంతో కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top