సహజ సంపద సీమాంధ్ర వశం

సహజ సంపద సీమాంధ్ర వశం


- ఆంధ్రలోకి వెళ్లిన విలువైన ఖనిజ నిక్షేపాలు

- కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయిన తెలంగాణ

- పోలవరం ముంపు మండలాల విలీన ప్రభావం

వేలేరుపాడు : జిల్లాలో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో వీలినం చేయడం వల్ల తెలంగాణలోని విలువైన ఖనిజ నిక్షేపాలు సీమాంధ్ర ప్రభుత్వ వశం కానున్నాయి. ఈ ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతం ముంపులో లేనప్పటికీ, ఆయా మండలాల భూభాగమంతా ఆంధ్రలో కలపడంతో తెలంగాణకు కాకుండా పోనున్నాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఆంధ్రలో విలీనం చేసినప్పటికీ మునగని ప్రాంతం తెలంగాణలో  ఉంచితే ఈ ఖనిజ నిక్షేపాలు తెలంగాణకే దక్కుతాయి. ముంపు మండలాలైన భద్రాచలం, వేలేరుపాడు, కుక్కునూరు, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో ఎంతో విలువైనఅబ్రకం (మైకా), క్వార్జ్, ఇనుప ఖనిజం, కొరండ, ఆల్‌క్లైన్ రాక్స్ తదితర ఖనిజ సంపద నిల్వలు అపారంగా ఉన్నాయి.



 కానీ.. ఏజెన్సీ వాసుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు రూపొందించిన కొన్ని ప్రత్యేక చట్టాలు వీటి వెలికితీతకు ఆవరోధంగా మారాయి. దీంతో ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద భూగర్భంలోనే మగ్గుతోంది. ఈ ప్రాంతంలో లభించే  అబ్రకం(మైకా), క్వార్జ్, కొరండ, ఆల్‌క్లైన్ రాక్స్ తదితర విలువైన సంపద  కొంత మేరకు పట్టా భూముల్లోనూ మరికొంత అటవీ భూముల్లోనూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో అమల్లో ఉన్న చట్టాలు ప్రభుత్వ నిబంధనలు వీటి వెలికి తీతకు అవరోధంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీలో అమల్లో ఉన్న ప్రత్యేక చట్టాలు పరిస్థితి ఏర్పర్చాయని  చెప్పొచ్చు.



ఈ చట్టాల ప్రకారం ఏజెన్సీలోని భూములు క్రయంగా పొందడం గానీ, లీజుకు తీసుకోవడం గానీ నిషేధం. దీంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు ప్రవేశించే అవకాశం లేదు. అయితే ఇక్కడి భూములపై పట్టా హక్కులు ఉన్న రైతులంతా గిరిజనులు కావడంతో వాటి వెలికితీతకు అవసరమయ్యో వ్యయాన్ని భరించే స్థితిలో లేకపోవడం మరో కారణం. దీంతో ఆ సంపదకు విముక్తి లభించడం లేదు. వీటి వెలికితీతకు మార్గం సుగమనమైతే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం రాయిల్టీ రూపంలో వచ్చే అవకాశముంది. కానీ.. ప్రభుత్వం సైతం ఈ సంపద వెలికితీతకు అనువైన అంశాలను పరిశీలించడం లేదు.



అయితే.. నిబంధనలను పట్టుకొని అధికారులు వేళ్లాడుతుంటే కొందరు అక్రమ రవాణాదారులు ఇదే అదునుగా భావించి ఈ సంపదను గుట్టుచప్పుడు కాకుండా కొల్లగొట్టుకు పోతున్నారు. నిబంధనలలోని లోసుగులను ఆధారంగా చేసుకోవడం ద్వారా అయితేనేమీ అక్రమంగా తరలించడం ద్వారా అయితేనేమీ మొత్తం మీద ఇక్కడ ఖనిజ సంపద వల్ల ప్రభుత్వానికి పైసా ఆదాయం సమకూర్చకుండానే పక్కదారి పట్టిన దాఖలాలు కోకొల్లలు. ప్రధానంగా అబ్రకం(మైకా), క్వార్జ్, ఇనుప ఖనిజం వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోనూ, కోరండ చింతూరు, ఆల్‌క్లైన్ రాక్స్ వేలేరుపాడు, కుక్కునూరు, వీఆర్‌పురంలోనూ క్వార్జ్  భద్రాచలం మండలంలోనూ విరివిగా ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.



ఈ సంపద ఎక్కువ శాతం గిరిజనుల భూములలో ఉండటంతో వాటి వెలికితీతకు గిరిజనులకు మాత్రమే హక్కు ఉంది. అయితే ఈ సంపదపై గిరిజనులకు అంతగా అవగాహన లేకపోవడం, వాటి రవాణా, దానికి గల డిమాండ్ తదితర అంశాలపై అనుభవం లేకపోవడంతో గిరిజనులు వాటిపై శ్రద్ధ చూపడం లేదు. మరికొన్ని నిల్వలు అటవీ భూములల్లో ఉండటంతో ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. నిబంధనల ప్రకారం అటవీ భూమి లీజుకు పొందాలంటే అంతే విస్తీర్ణం గల స్థలాన్ని అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంది. ఇది ప్రభుత్వ పరంగానే సాధ్యమవుతుంది.  దీంతో పారిశ్రామికవేత్తలెవ్వరూ ముందుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ఖనిజ సంపద అధికారికంగా వెలికితీతకు నోచుకోవడం లేదు.



ఇది కొందరు అక్రమ రవాణాదారులకు మంచి అవకాశంగా మారింది. చింతూరు మండలంలో కోరండం రాళ్ల అక్రమ రవాణా భారీస్థాయిలో జరగడం, దానిపై అటవీ అధికారులు విసృ్తతంగా దాడులు చేయడం లాంటి సంఘటనలు ఉన్నాయి. వేలేరుపాడు మండలానికి 27 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుళ్లమడుగు గిరిజన గ్రామ పరిధిలో అబ్రకం గనులు విరివిరిగా ఉన్నాయి. అయితే ఆ గ్రామంలో  ఓ గిరిజనేతరుడు ఇక్కడి గిరిజనుల భూములను తన భార్య (గిరిజన) పేరు మీద లీజుకు తీసుకొని కొంతకాలం ఈ అక్రమ వ్యాపారం సాగించాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. భద్రాచలం మండలంలోని రంగాపురం గ్రామంలో  బినామీ పేర్లతో క్వార్జ్ (తెల్లరాయి)ని తరలిస్తున్నారు.



అలాగే కుక్కునూరు మండలం కివ్వాకలో కొంతకాలం అక్రమంగా రవాణా కొనసాగింది. ఆ తర్వాత అధికారులు నిలిపివేశారు. ఇదే మండలంలో ఇటీవల ఎంతో విలువైన ఇనుప రాయి ఖనిజం బయటపడింది. మండలంలోని రెడ్డిగుడెం గుట్టల్లో విరివిగా ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని కల్పక్కంలోని ఇందిరాగాంధీ అణువిద్యుత్ కేంద్రం శాస్త్రవేత్తలు నిర్ధారించారు. న్యూక్లాయర్ రియాక్టర్ నిర్మాణంలో ఈ ఖనిజం కీలకమని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో లభించే ఇనుప ఖనిజం కన్నా 4,5 రెట్లు శక్తి కలిగి ఉందని తేలింది. ఈ విధంగా ఇక్కడ ఉన్న అపార ఖనిజ సంపద ప్రభుత్వానికి పైసా ఆదాయం సమకూర్చలేక పోతోంది. నిబంధనలను సడలించి, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా ఈ ప్రాంత గిరిజనులకు ఉపాధి లభిస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top