ఎమ్మెల్యేలకు రహస్య కోడ్?

ఎమ్మెల్యేలకు రహస్య కోడ్?


పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఒక్కో ఎమ్మెల్యేకు రహస్య కోడ్‌ను ఇవ్వాలని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. శని ఆది వారాల్లో మాక్ ఓటింగ్ నిర్వహించి, నాయకత్వం సూచించిన తరహాలో సభ్యులు ఓటు వేస్తారా అన్నది పరీక్షించడంతో పాటు  వారికి తగిన శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందుకుగాను, టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఎవరికి ఎవరెవరు మొదటి, రెండో ప్రాధాన్యత ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించి తదనుగుణంగా ఎమ్మెల్యేలకు కోడ్‌లను కేటాయిస్తారు. ఒక్కో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి 18 ఓట్లు అవసరమైనపుడు, అంత సంఖ్యలో సభ్యులు లేకుంటే, అంతకన్నా తక్కువ సంఖ్య సభ్యుల్ని బృందంగా ఖరారు చేస్తారు. వారంతా ఒక  అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేందుకు నిర్ణయించి, వారి రెండో ప్రాధాన్యత ఓటును మాత్రం వేర్వేరు అభ్యర్థులకు కేటాయిస్తారు.



ఎమ్మెల్యేలను ఐదు గ్రూపులుగా విభజించి, అదే పద్ధతిన ఐదు ఎమ్మెల్సీ అభ్యర్థులకు విడగొట్టి, అందులో ఒక్కో గ్రూపులోని రెండో ప్రాధాన్యత ఓట్లను ఇతర గ్రూపుల్లోని అభ్యర్థులకు వేసేలా రహస్య కోడ్‌లు జారీ చేస్తారని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే వారికి మాత్రమే ఐదు గ్రూపుల్లోని మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి పడ్డాయో తెలుస్తుంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే వెంటనే గుర్తించవచ్చు. నిజానికి టీఆర్‌ఎస్ ఏ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. మాక్ ఎలా నిర్వహిస్తారు, అసలు ఎన్నికకు ఏ విధానాన్ని అనుసరిస్తారు అన్నది శనివారం నాటికి ఓ స్పష్టత వచ్చే ఆస్కారముంది. ఇటువంటి సందర్భాల్లో అయిదుగురిని గెలిపించుకోవాలనుకుంటున్నపుడు, మొదటి ముగ్గురు అభ్యర్థులకి ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరమైన కనీస సంఖ్యకు తగ్గకుండా కేటాయిస్తారు. నాలుగు, ఐదవ అభ్యర్థులకు మాత్రం ప్రథమ ప్రాధాన్యత ఓట్లు ఒకటి, రెండు తగ్గించి (అందుబాటులో ఉన్న మొత్తం సంఖ్య ప్రకారం) కేటాయిస్తారు. మొత్తం సభ్యులు జాగ్రత్తగా రెండో ప్రాధాన్యత ఓటును వీరికే వేసేలా వ్యూహరచన చేస్తారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా, పార్టీ నాయకత్వం చెప్పినట్టే అనుసరించిందీ లేనిదీ నిర్దారించుకోవడానికి, మూడో, నాలుగో ప్రాధాన్యతా ఓటును కూడా వ్యూహం ప్రకారమే ఒక్కో సభ్యునికి ఒక్కో విధంగా నిర్ణయించి, ఫలితాల అనంతరం విశ్లేషిస్తారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top