పగలంతా బడి! రాత్రంతా బార్‌..!!

పగలంతా బడి! రాత్రంతా బార్‌..!! - Sakshi

టేకులపల్లి : అదొక చిన్న పల్లె.. అక్కడొక బుడ్డి బడి..! పగలంతా పిల్లలతో కళకళ..రాత్రంతా సీసాలతో గోలగోల..!!

 

ఎక్కడ..?

టేకులపల్లి మండలంలోని బేతంపూడి పం చాయతీలోగల తొమ్మిదోమైలు తండా. అదొక చిన్న పల్లె. అక్కడొక.. మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. 30 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయినులు ఉన్నారు. అటెండర్, స్వీపర్‌ లేరు.

 

ఏమైంది..?

బడి కాస్తా.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌గా మారింది. సెలవు రోజు వచ్చిందంటే చాలు.. ఈ బడి వాతావరణం చెప్పలేనంత అధ్వానంగా, రోత గా మారుతోంది. లోపలికి వెళితే.. గుప్పున మద్యం వాసన. పగిలిన మద్యం సీసాలు. తినుబండారాల వ్యర్థాలు. ప్లాస్టిక్‌ కవర్లు. ఒక రోజు కాదు.. ఒక వారం కాదు.. దాదాపుగా ఐదేళ్ల నుంచి దాదాపుగా ప్రతి రోజూ.. సెలవు రోజుల్లో తప్పనిసరిగా కనిపిస్తున్న దృశ్యమిది.

 

ఎవరు..?

ఇంకెవరు..? ఈ తండాలోని తాగుబోతులు. వారే ఈ బడిని రాత్రి వేళ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌గా మారుస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలంతా తమ తమ్ముళ్లో, బిడ్డలో, బంధువుల పిల్లలో అనే కనీస జ్ఞానం కూడా లోపించిన బుద్ధి హీనులు. తమ చర్య కారణంగా ఇబ్బందులు పడుతున్నది తమ ఊరి పిల్లలేనన్న ఆలోచన కూడా లేని అజ్ఞానులు. వారే దీనిని ఇంత అధ్వానంగా, ఛండాలంగా తయారుచేస్తున్నారు. తామంతా ఒకప్పుడు ఈ బడి గోడల మధ్యనే నాలుగు అక్షరాలు నేర్చుకున్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.

 

ఎలా..?

ఈ బడిలోకి ఆ తాగుబోతులు ఎలా వస్తున్నారన్నదేగా మీ ప్రశ్న! సుమారు మూడు నెలల క్రితం మిషన్‌ భగీరథ తవ్వకాలు చేపట్టారు. ఆ పనులు చేపట్టిన సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ పాఠశాల ముందు గోడ ధ్వంసమైంది. కింద పడిన గేటును తీసి పక్కన విసిరేశారు. ఈ బడి ఆవరణలో వెనుక భాగాన ఓ  పాత భవనం ఉండేది. దానిని తొలగించడంతో ప్రహరీ లేకుండా పోయింది. ముందు, వెనుక.. రెండువైపులా ప్రహరీ లేకపోవడంతో లోపలికి  తాగుబోతులు, జంతువులు యథేచ్ఛగా వస్తున్నాయి.

 

ఇబ్బందే...

కొద్దిగ కాదు.. చాలా! ఇక్కడ దాదాపుగా 30మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయినులు ఉన్నారు. ఇందులో ఒకరు ప్రధానోపాధ్యాయురాలు. ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటోందని వారిని పలకరిస్తే.. వెంటనే ఏమీ చెప్పలేక, ఎలా చెప్పాలో తెలీక.. ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఇలా తమ మనోవేదనను ఇలా వివరించారు.. ‘‘ఉదయమే బడికి రావాలంటే భయమేస్తోంది. తరగతి గదుల్లో ఏం చూడాల్సొస్తోందని వణుకు పుడుతోంది. ఆదివారం, వరుసగా సెలవు రోజులొస్తే.. మాకు నరకం దాపురించినట్టే. బడి పక్కనే మద్యం దుకాణం ఉంది. అక్కడి నుంచి మందు బాటిళ్లు, తినుబండారాలు తెచ్చుకోవడం.. ఇక్కడికొచ్చి తాగడం, తినడం. తాగిన సీసాలను, తినుబండారాల కవర్లను, వ్యర్థాలను తరగతి గదుల్లో ఇష్టమొచ్చినట్టుగా పడేస్తున్నారు. చెప్పడానికే సిగ్గుగా ఉంది... (ఇబ్బందిపడుతూ, తలొంచుకుని).. తరగతి గదుల్లోనే మలం, మూత్రం విసర్జిస్తున్నారు. మాకు ఇక్కడ స్వీపర్, అటెండర్‌ లేరు.

 

ఛండాలంగా మారిన ఈ గదులను పిల్లలు రాక ముందే మేమే శుభ్రం చేసుకోవాలి. ఐదేళ్ల నుంచి ఇదే నరకం. మొన్న గురువారం ఉదయం మేము వచ్చేసరికి నాలుగు బీరు సీసాలు, తినుబండారాల వ్యర్తాలు కనిపించాయి. మూత్ర విసర్జన దుర్వాసన కూడా వచ్చింది.  గ్రామస్తులను పిలిచాం. చూశారు.. వెళ్లారు. ఈ ఊళ్లోని కొందరైతే.. ‘ఇద్దరు టీచర్లు ఉన్నారుగా! ఒకరు పాఠాలు చెప్పండి.. ఇంకొకరు శుభ్రం చేయండి’ అని ఎగతాళిగా మాట్లాడారు. అధికారులకు చెప్పాం, గ్రామస్తులకు చెప్పాం, ఇక్కడి ప్రజాప్రతినిధులకు చెప్పాం. ఇంకేం చేయాలి? మాకు ఈ నరకం ఇంకెన్నాళ్లో్ల..’’ ఉబికొస్తున్న కన్నీళ్లను ఆపడం ఆ ఉపాధ్యాయినులకు సాధ్యపడలేదు.

 

ఏమంటున్నారు..?

ఎవరు..? అధికారులేగా..! ఎంఈఓ ఠాకూర్‌ రాంసింగ్‌ను కూడా ‘సాక్షి’ పలకరించింది. ‘‘తొమ్మిదోమైలుతండా పాఠశాలలో సమస్యను అక్కడి ఉపాధ్యాయినులు నా దృష్టికి తీసుకొచ్చారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పాలని సూచించాను. వారు పని కూడా చేశారట. స్పందన రాలేదట. దీనిని అక్కడి గ్రామ పెద్దలతోపాటు పోలీసుల దృష్టికి తీసుకెళతాం’’ అని అన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top