బాలుడిని బలిగొన్న బడి బస్సు

బాలుడిని బలిగొన్న బడి బస్సు

  •  డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి

  •   కోపోద్రిక్తులైన స్థానికులు.. వ్యాన్‌పై దాడి

  • ఉప్పల్/ రామంతాపూర్: స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన  స్థానికులు బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఉప్పల్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ఉప్పల్ పారిశ్రామిక వాడ లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన బారెడి సునీల్ కుమారుడు రోషన్(5) హబ్సిగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు.



    శనివారం తరగతులు ముగిసిన అనంతరం స్కూల్ బస్సు  లక్ష్మీనారాయణ కాలనీలోని రోషన్ దిగే స్టేజీ వద్దకు చేరుకుంది. బస్సు ఆగిన వెంటనే బాలుడు బస్సులో నుంచి దిగి ఇంటి బాట పట్టాడు.  ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ వెంటనే బస్సును వెనక్కి తీసుకున్నాడు. దీంతో రోషన్‌ను ఢీకొని, వెనక చక్రాలు అతడిపైనుంచి వెళ్లాయి. బాలుడి తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే రామంతాపూర్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అప్పటికే రోషన్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కోపోద్రిక్తులైన స్థానికులు బస్సును ధ్వంసం చేశారు.

     

    ఒక్కగానొక కుమారుడు..

     

    రోషన్ తండ్రి సునీల్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి పద్మశ్రీ  గృహిణి. వీరికి  రోషన్ ఒక్కడే కుమారుడు. అతడ్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లి బస్సు వద్దకు వచ్చే లోపే ఈ సంఘటన జరగడంతో సంఘటన స్థలంలో పద్మశ్రీ కుప్పకూలి పోయింది.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వచ్చి తల్లిని లేపి గాయాలపాలైన రోషన్‌ను అసుపత్రికి తరలించారు. బాలుడి మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా కొత్త డ్రైవర్ కావడం, బస్సు కూడా కండీషన్‌లో లేకపోవడం, దీనికి తోడు రివర్స్‌లో వెళ్లే సమయంలో సైడ్ చూపించే క్లీనర్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  



     స్థానిక ఎమ్మెల్యే పరామర్శ

     

    ఈ సంఘటన విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్  ప్రభాకర్, నాయకులు అశోక్ కుమార్ గౌడ్, ప్రతిభ తదితరులు బాలుడి తల్లిదండ్రులను పరామర్శించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top