ఆర్వీఎంలో అక్రమం


అటవీ శాఖలో బోగస్ కొలువుల బాగోతం ఇంకా సద్దుమణుగక ముందే రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఉద్యోగాల్లో ఇలాంటి అక్రమమే మరొకటి వెలుగు చూసింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమార్కులు అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. కొలువుల ఆశ చూపి నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు తెరలేపారు. రూ.లక్షల్లో దండుకున్నారు.            



సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజీవ్ విద్యామిషన్ పరిధిలో జిల్లాలో 52 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను ఔట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరైంది. అకౌంటెంట్లు, ఏఎన్‌ఎంలు, అటెండర్లు(ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్), వాచ్‌మెన్లు, స్వీపర్లు ఇలా వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.30 నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువులు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటూ అమాయక అభ్యర్థులను మభ్య పెట్టారు.



సర్కారు కొలువు వస్తుందని.. ఎప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగులమయ్యే అవకాశాలున్నాయని భావించిన అమాయక అభ్యర్థులు అక్రమార్కుల బుట్టలో పడ్డారు. ఇలా వసూలు చేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాల్సిన ఈ పోస్టులకు కొందరు అభ్యర్థుల వద్ద ఆర్వీఎం కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం.



అడ్డదారిలో ఔట్ సోర్సింగ్ ఎంపిక..

ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాంతోపాటుగా బహిరంగ ప్రదేశాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ఈ నోటిఫికేషన్‌ను ఉంచాలి. అలా చేస్తేనే వివిధ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటాయి.



కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎలాంటి టెండర్లు పిలవకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీనీ ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన వారికి ఏజెన్సీని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో ఉండే జిల్లా మహిళా సమాఖ్యనే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.



మాకు ఎలాంటి సంబంధం లేదు - పి.యాదయ్య, ఆర్వీఎం పీవో

కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించాం. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఈ అక్రమాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు ఇచ్చిన, ఉద్యోగాలిపిస్తామని చెప్పి డబ్బులు పుచ్చుకున్న వారే బాధ్యులవుతారు. ఔట్‌సోర్సింగ్ ఎంపిక ఇంకా పూర్తికాలేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top