తిండీ తిప్పలూ కరువే

తిండీ తిప్పలూ కరువే - Sakshi


మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): ‘సౌదీలో రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకుంటాం.. వారిని సురక్షితంగా ఇళ్లకు రప్పిస్తాం..’ ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన ఇది! కానీ కార్మికుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. స్వయంగా మంత్రి ఆదేశించినా.. సౌదీలో రాయబార కార్యాలయం అధికారులు కదలడం లేదు. జైళ్లలో మగ్గుతున్నవారికి తాత్కాలిక పాస్‌పోర్టులు(ఔట్ పాస్‌పోర్టులు) ఇవ్వకపోవడంతో వారంతా నరకం అనుభవిస్తున్నారు. సరైన వసతి, భోజన సదుపాయం లేక తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు.

 

పట్టించుకునే నాథుడే లేడు..

ఆర్థిక సంక్షోభంతో సౌదీలోని ప్రధాన కంపెనీలు అయిన బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ కంపెనీలు మూతపడ్డాయి. అనేక చిన్న కంపెనీలు సైతం లాకౌట్ ప్రకటించాయి. మూతబడిన కంపెనీలు కార్మికులను క్యాంపుల నుంచి గెంటివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. కంపెనీల యాజమాన్యాలు కార్మికుల పాస్‌పోర్టులను ఇస్తే వారంతా స్వదేశాలకు చేరేవారు. కానీ కంపెనీలు పాస్‌పోర్టులు చేతికి ఇవ్వకుండా.. నెలల తరబడి బకాయి పడ్డ వేతనాలు చెల్లించకుండా కార్మికులను బజారున పడేశాయి. దీంతో అనేకమంది తమకు తెలిసిన వారి గదుల్లో ఆశ్రయం పొందుతుండగా మరికొందరు ఎలాంటి దారి లేక పోవడంతో రోడ్లపై బతుకీడుస్తున్నారు.



వీరంతా పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఔట్ జైళ్లకు తరలించారు. జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు సరైన వసతి, భోజన సదుపాయం లేదు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వీరికి ఔట్ పాస్‌పోర్టులను జారీ చే స్తే స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జెద్దా, రియాద్, హాయ్‌లలో ఉన్న రాయబార కార్యాలయం అధికారులు సకాలంలో ఈ పాస్‌పోర్టులు ఇవ్వడం లేదు. సెలవుల పేరుతో వారంలో మూడు నాలుగు రోజులు కార్యాలయాలను మూసి ఉంచుతున్నారు.



ఇప్పటికే ఔట్ పాస్‌పోర్టుల కోసం కార్మికులు చేసుకున్న దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. సెప్టెంబర్ 25లోపు భారత్‌కు వచ్చే కార్మికులకు సౌదీలోని కంపెనీల నుంచి బకాయి పడిన వేతనం సొమ్మును ఇప్పిస్తామని, ఇతర సంరక్షణ చర్యలను తీసుకుంటామని విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే ఇంకా ఔట్ పాస్‌పోర్టుల ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఎక్కువ సమయం కార్యాలయాన్ని నిర్వహించి ఔట్ పాస్‌పోర్టుల జారీని వేగవంతం చేయాలని కోరుతున్నారు.

 

రాయబార కార్యాలయంలో పట్టించుకోవడం లేదు

సౌదీలోని రాయబార కార్యాలయాల్లో సరైన స్పందన లేదు. ఔట్ పాస్‌పోర్టు జారీకి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అధికారులు పని వేళలు పాటించడం లేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

- సత్యనారాయణ, ఎలక్ట్రీషియన్, రియాద్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top