ఒక్కొక్కటిగా రద్దు..!


- సర్వశిక్షా అభియాన్‌లో పథకాలన్నీ రద్దు

- మిగిలింది కేజీబీవీల నిర్వహణే

- బాలిక విద్యాభివృద్ధికి మంగళం

- ఉపాధ్యాయులకు శిక్షణ లేదు

- రెండేళ్ల నుంచి ప్రహరీ లేదు.. అదనపు గదుల్లేవ్

సాక్షి, కరీంనగర్ : ఎన్నో లక్ష్యాలు.. మరెన్నో ప్రణాళికలతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సర్వశిక్షా అభియాన్ అచేతనంగా మారింది. అధికారుల నిర్ణయాలతో సిబ్బందికి ప్రస్తుతం పని లేకుండాపోయింది. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలపై శిక్షణ.. విద్యాభివృద్ధికి ప్రణాళికలు.. విద్యార్థులకు ప్రోత్సాహకాలు.. సర్కారు స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు పేరుకే పరిమితమైంది. ఆశించిన ఫలితాలు కానరాకో..? అమలవుతున్నవి నిష్ర్పయోజన పథకాలు అనుకున్నాయో? తెలియదు గానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులోని కీలక పథకాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నాయి.



సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో గ తంలో ప్రతి విద్యాసంవత్సరం 13 నుంచి 19 వినూత్న కార్యక్రమాలు.. పథకాలు కొనసాగాయి. ప్రస్తుతం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) మాత్రమే మిగిలాయి. మూడేళ్లలో ఆరుకు పైగా కీలక పథకాలు రద్దయ్యాయి. దీంతో మిగిలిన సిబ్బంది సాధారణ పనులకే పరిమితమయ్యారు. ఇంకొందరు గత పథకాల ప్రగతిపై సమీక్ష .. గతంలో మిగిలిన పనుల పూర్తిపై దృష్టిపెట్టారు. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.20 కోట్ల మేర నిధులు జిల్లాకు వచ్చాయి.

 

పథకాల ప్రారంభమిలా..

చదువుకు దూరమవుతున్న బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల నే ఉద్దేశంతో 2003లో కేంద్రప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధి (నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవల్ (ఎన్‌పీఇజీఇఎల్)) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. ఇతర కారణాలతో చదువుకు దూరమవుతున్న విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెం పొందించి.. తమ కాళ్లపై తాము నిలబడేలా 6, 7, 8 తరగతుల వారికి టైలరింగ్, మగ్గం పను లు, క్యాండిళ్లు.. చాక్‌పీస్.. న్యాప్‌కిన్ల తయారీ వంటి వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుం ది.



 

వీరితోపాటు 3, 4 ,5 తరగతి విద్యార్థినులకు రెమిడియల్ తరగతులు నిర్వహించి.. చదువులో వెనకబడిన వారికి మెటీరియల్ ఇచ్చి చదవడం.. రాయడం నేర్పించాలి. ఇందుకోసం ఎనిమిది స్కూళ్లతో క్లస్టర్ స్కూల్‌ను ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేశారు. ఇలా జిల్లాలో 384 క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 70వేల మంది బాలికలు ఈ పథకంతో లబ్ధిపొందారు. ఇలాంటి పథకాన్ని 2011-12 విద్యా సంవత్సరంలో రద్దు చేశారు.

     

సమాజంలో లింగవివక్ష, మూఢనమ్మకాలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంలో గతంలో బాలిక ‘చేతన’ పథకాన్ని అమలు చేశారు. పథకంలో భాగంగా.. ఉపాధ్యాయినులకు పైఅంశాల్లో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు అవగాహన కల్పించారు. పథకంతో విద్యార్థినులు ఎంతోమందికి లబ్ధి చేకూరింది. గ్రామాల్లో లింగవివక్ష, మూఢ నమ్మకాలు కొంచెకొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈ పథకానికి మూడే ళ్ల క్రితమే బ్రేక్ వేశారు.

     

బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులు లేక పీఎస్, యూపీఎస్ స్కూళ్లు మూతబడుతుండడంతో ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో విద్యావాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. తక్కువ వేతనాలతో ఉన్నత విద్యనభ్యసించిన వారిని ఎంపిక చేసి విద్యార్థులకు చదువు చెప్పించింది. ఇలా జిల్లాలో 1500పై చిలుకు మంది వీవీలుగా పనిచేశారు. ఈ వ్యవస్థను ప్రభుత్వం గతేడాది రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి.

     

జిల్లాలో ముఖ్యంగా మండల, గ్రామాల్లో నివసించే కుటుంబాలో తల్లీదండ్రులు కూలీ, వ్యవసాయ, ఇతర పనులకు వె ళ్తారు. ఆ సమయంలో ఇంట్లో చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు అమ్మాయిలను కాప లా పెడతారు. దీంతో బడికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటికే పరిమితం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం గతం లో ‘పూర్వ ప్రాథమిక విద్య’కు శ్రీకారం చుట్టింది. నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్న పిల్లల కోసం కేంద్రాలు ఏర్పాటు చేసింది. బడీడు వచ్చిన అమ్మాయిలు తన తమ్ముళ్లు, చెళ్లెళ్లను ఈ కేంద్రాల్లో విడిచి స్కూలుకు వెళ్లేవారు. అలాంటి కేంద్రాలకు ప్రభుత్వం మూడేళ్లక్రితమే తాళం వేసింది. దీంతో పరిస్థితి మొదటికొచ్చింది.

     

పెవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు స్కూళ్లలో మెరుగైన, నాణ్యమైన విద్య అం దించాలనే ఉద్దేశంతో అభియాన్ ఏటా విద్యా సంవత్సరం పునఃప్రారంభ సమయంలో మూడు మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై ఆరురోజుల పాటు వృత్త్యంతర శిక్షణ ఇచ్చేవారు. ఈ శిక్షణతో ఉపాధ్యాయులు ఎంతగానో నేర్చుకుని తరగతి గదిలో విద్యార్థులకు బోధించే వారు. ఈ శిక్షణకు రెండేళ్లుగా పత్తా లేదు.

     

ఇటు గ్రాంట్ల విషయంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. తరగతి గదిలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధించేలా గతంలో ప్రతి ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున.. స్కూల్‌కు రూ.2,500కు మించకుండా గ్రాంట్ ఇచ్చేది. దీనిని గత విద్యా సంవత్సరం నుంచి నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న స్కూల్ కాంప్లెక్స్‌లకు ఏటా రూ.27వేల చొప్పున గ్రాంట్ విడుదల చేసిన సర్వశిక్షా అభియాన్.. గత విద్యా సంవత్సరం నుంచి రూ.10 వేలకే పరిమితం చేసింది.  స్కూల్ కాంప్లెక్స్‌లకు నిధుల సమస్య తలెత్తుతోంది.

     

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకూ ప్రాజెక్టు వెనకడుగు వేసింది. విద్యార్థులు ఎక్కువగా ఉండి.. తరగతి గదులు కొరతగా ఉన్న చోట అదనపు గదుల నిర్మాణం.. ప్రహరీ లేని పాఠశాలలకు ప్రహరీ నిర్మిం చాల్సి ఉండగా గత విద్యా సంవత్సరం ఒక్క అదనపు తరగతిగానీ.. ప్రహరీగానీ మంజూరుకాలేదు. ఈ విద్యా సంవత్సరం అదనంగా 220 అదనపు గదుల మంజూరయ్యాయి. ప్రహరీల ఊసు మాత్రం లేదు. అలాగే అంగవైకల్యం ఉన్న వారికి రెండేళ్ల నుంచి ట్రైసైకిళ్లు, వీల్‌చైర్ల మంజూరు కాలేదు. పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందించే  ‘జలమణి’ యూనిట్ల మంజూరు రెండేళ్ల నుంచి లేదు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top