సర్వ‘భక్షా’భియాన్


ఖమ్మం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు విడుదల చేసే సర్వశిక్ష అభియాన్ జిల్లాలో సర్వ భక్ష అభియాన్‌గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో విద్యావలంటీర్ల వేతనాలు, ఇతర ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ పేరిట భక్షణ జరిగినట్లు బయటపడింది. ఏకరూప దుస్తులు, కేజీబీవీలు, భవిత సెంటర్ల వస్తువులు, బోధనోపకరణాల కొనుగోళ్ళలోనూ రూ.లక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అధికారులను బదిలీ చేశారు.



మరికొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. అయినా ఆశాఖ అధికారుల్లో మార్పు రాలేదని తెలుస్తోంది. కస్తూరిబా గాంధీ, సివిల్ వర్క్స్‌లో మరోమారు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. వాహనాల వినియోగం, ఇతర వస్తువుల కొనుగోళ్లలో బిల్లులు తారుమారు చేశారని తెలుస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీల పనులను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టడంపై జిల్లా ఉన్నతాధికారులు అభ్యంతరాలు చెప్పినా సదరు ఉద్యోగుల సెక్షన్లు మార్చకపోవడం విమర్శలకు తావిస్తోంది.

 

సంవత్సరాలు గడిచినా తేలని లెక్కలు..

నూతన భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన , పాఠశాలలో వివిధ కార్యక్రమాలు, సైన్స్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ సామగ్రి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది. గత సంవత్సరం పాఠశాల గ్రాంట్స్, పాఠశాల నిర్వాహణ నిధులు, ఏకరూప దుస్తుల డబ్బులు, వాటి కుట్టుకూలి, ఉపాధ్యాయుడి గ్రాంట్స్, స్కూల్ కాంప్లెక్స్, సివిల్ వర్క్స్, ఎస్కాట్ అలవెన్స్, సీడబ్ల్యూ టాయిలెట్స్, వార్షికోత్సవ నిర్వాహణ నిధులు... సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అకౌంట్లలో జమచేశారు.



గత సంవత్సరం ఖర్చు అయిన డబ్బులు పోగా మిగిలిన డబ్బుల లెక్కలు చెప్పేందుకు పలువురు ఉపాధ్యాయులకు తమ అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయి. అవి ఏ గ్రాంట్స్‌కు సంబంధించినవి అనేది తెలియడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధులలో ఖర్చుకాగా రూ. 10.63 కోట్లు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో రూ. 79,11,532కు లెక్క తేలక సదరు ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. సర్వశిక్ష అభియాన్ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బులను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 17 బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహిస్తూ వీటిని ఖర్చు చేస్తున్నారు.



ఆయా బ్యాంకుల అధికారులతో ఎస్‌ఎస్‌ఏలో పనిచేసే ఉద్యోగులు కుమ్మక్కై వీటిని ఇష్టానుసారం డ్రా చేసే వారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులనూ తప్పుతోవ పట్టించిన సందర్భాలు లేకపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు పీవోలు రూ.లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయా అధికారులపై రాష్ట్ర స్థాయిలో విచారణ సైతం జరిగింది.



అక్కడ తమకు ఉన్న పలుకు బడిని ఉపయోగించుకొని సదరు అధికారులు బయటపడ్డారనే ప్రచారం సైతం జరిగింది.  దీనిని గమనించిన రాష్ట్ర అధికారులు ఎస్‌ఎస్‌ఏ లావాదేవీలు అన్ని ఎస్‌బీహెచ్ ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) ద్వారా జరపాలని ఆదేశించారు. ఈ బ్యాంకుల మార్పిడిలో జిల్లాలో సుమారు 12 పాఠశాలలు ముందుకు రాకపోవడం, పలు పాఠశాల హెచ్‌ఎంలు బ్యాంకులు మార్చినా తమ ఖాతాలో ఉన్న డబ్బుల వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. సుమారు 100కు పైగా పాఠశాలల హెచ్‌ఎంలు ఆడిట్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

పలువురు ఉద్యోగులు ఆడిందే ఆట

విద్యాశాఖలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ ఉద్యోగుల పోస్టులు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో లేకపోవడంతో ఒకటి, రెండు సంవత్సరాలు బయట విధులు నిర్వహించినా మళ్లీ వచ్చి ఇక్కడే తిష్టవేస్తున్నారు. డీఈవో, ఆర్వీఎంలలో పనిచేయటం పరిపాటిగా మారింది. ఒకే సెక్షన్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తుండటంతో లావాదేవీలు, వసూళ్లలో ఆరితేరుతున్నారనే అభియోగం ఉంది.



పాఠశాల మౌలిక వసతులు, భవనాలు, మానిటరింగ్‌తో పాటు విద్యాశాఖ అధికారికి కలిపి పది వాహనాలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఈ వాహనాలను పలువురు ఉద్యోగులు తమ సొంతానికి వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో ఉండే ఓ  అధికారి తమ కుటుంబ సభ్యుల పేరున కారు పెట్టి వందల కిలోమీటర్లు తిరిగినట్లు ప్రతి నెల బిల్లులు తీసుకోవడం గమనార్హం.



ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

బి. శ్రీనివాస్, ఎస్‌ఎస్‌ఏ పీవో

కార్యాలయం ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే స్పష్టమైన ఫిర్యాదులు ఎవరూ చేయలేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సంవత్సరాల తరబడి ఒకే సెక్షన్‌లో ఉద్యోగులు ఉన్నారనేది వాస్తవం. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారితో కూడా చర్చించాను. త్వరలో జిల్లా కలెక్టర్‌గారి అనుమతితో సెక్షన్లు మార్పు చేస్తాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top