పాలకపక్ష బలహీనతే మా బలం

పాలకపక్ష బలహీనతే మా బలం - Sakshi


- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

- రాష్ట్రంలో కేసీఆర్ విధానాలే లెఫ్ట్ బలపడేందుకు దోహదపడతాయి

- సీపీఎం మహాసభల నేపథ్యంలో సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ


 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు బలపడేందుకు సీఎం కేసీఆర్ విధానాలే దోహదం చేస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చక్కటి పాలనను అందిస్తే ప్రజలు సహకరిస్తారని, లేకుంటే   కోపంతో ఉద్యమాల్లోకి వస్తారని, తాము వారికి అండగా నిలిచి రాష్ట్రంలో రాజకీయంగా కోల్పోయిన స్థానాన్ని తిరిగి సంపాదించుకుంటామని పేర్కొన్నారు. మార్చి 1-4 తేదీల మధ్య హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం మహాసభల నేపథ్యంలో శుక్రవారం ఆయన మగ్దూమ్‌భవన్‌లో ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు..

సాక్షి: మహాసభలంటూ పెద్దఎత్తున హైప్ క్రియేట్‌చేశారు. ఫలితం ఉంటుందా?

తమ్మినేని: ఫలితాలు రావడానికి హైప్ అవసరమే. తగిన వాతావరణం సృష్టించడానికి అది ఉపయోగపడింది. సీపీఎం అంటే ప్రజల్లో విశ్వాసం రావడానికి దోహదపడింది. అయితే కిందిస్థాయిలో ప్రజల కోరికలు, ఆయా తక్షణ సమస్యలు తెలుసుకుని తదనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలి.

 

సాక్షి: పార్టీ ఎక్కడ దెబ్బతిన్నది?

తమ్మినేని: మధ్యతరగతి ప్రజలను అర్థం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. వర్కింగ్ క్లాస్, క్యాపిటలిస్ట్ క్లాస్ అంటూ మధ్యతరగతిని మరచిపోయాం. రాజకీయంగా ఈవర్గంతో ఏ విధంగా వ్యవహరించాలో తెలియక వెనుకబడ్డాం. ఈ అంశంపై కేంద్ర కమిటీ ఒక అధ్యయన బృందం వేసింది. విశాఖలో జాతీయ మహాసభల తర్వాత పూర్తి దృష్టిపెడతాం.

 

సాక్షి: సమస్య తుదికంటా ఉద్యమాలు చేయడంలేదనే విమర్శలున్నాయి?

తమ్మినేని: సమస్య చిన్నదైనాసరే. అది పరిష్కారమయ్యే వరకు పోరాటం చేయాలని మహాసభల్లో నిబంధనను విధించనున్నాం. ప్రజల తక్షణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించాం.

 

సాక్షి: మహాసభల లక్ష్యం ఏమిటి?

తమ్మినేని: తెలంగాణలో మళ్లీ బలోపేతం కావాలి. వామపక్ష, ప్రగతిశీలశక్తులు, సమస్యలపై పోరాడే సంస్థలు కలసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా కార్యక్రమాలు చేపట్టాలి. వామపక్ష భావజాలం ఎక్కువగా ఉంది. బలం మాత్రం తక్కువగా ఉంది. దానిని వాస్తవ బలంగా మార్చాలి. ముందుగా వామపక్షాల మధ్య ఐక్యత సాధించాలి. ఈ దిశలో నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక మంచి పరిణామం. మొత్తం దేశంలోనే తొలిసారి పదివామపక్షాలు కలసి ఓ ఎమ్మెల్సీ అభ్యర్థిని బలపరిచాయి. కిందిస్థాయిలో సమస్యలపై పోరాడి బలోపేతం కావాలి.

 

సాక్షి: రాజకీయంగా ఎదురుదెబ్బలు ఎందుకు తగిలాయి ?

తమ్మినేని: బూర్జువా పార్టీలతో పొత్తు వల్ల ఆ పార్టీలకు.. వామపక్షాలకు తేడాలేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీంతో గుర్తింపును కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం తో తాము ఏమిటీ, ప్రతిపక్షాలుగా ఏమిటన్న దానిపై స్పష్టత లేకుండా ఆ పార్టీలతో ఊరేగాం. ఇకపై కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ ఇతర పార్టీలతో ఇక పొత్తు ఉండదు.

 

సాక్షి: టీఆర్‌ఎస్‌పై మీ వైఖరి..?

తమ్మినేని: 2014 ఎన్నికల్లో అడగక పోయినా టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చాం. మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అడిగితే మద్దతునిచ్చాం. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫోన్లో మద్దతు కోరారు. ఇది వ్యక్తుల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో కాకుండా, పార్టీగా సమర్థించే స్థాయి దాటిపోయిందని స్పష్టం చేశాం.

 

సాక్షి: తెలంగాణకు వ్యతిరేకమనే

 ముద్రపై ఏమంటారు ?

తమ్మినేని: అది ముగిసిన అధ్యాయం. రాజకీయంగా తెలంగాణలోనే కాకుండా దేశంలోనే దెబ్బతిన్నాం. ఆ ముద్ర ఇప్పుడు లేదు.  



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top