జరిమానా కట్టాల్సిందే..

జరిమానా కట్టాల్సిందే.. - Sakshi

చేతిలో చిల్లిగవ్వలేక ఓ బాలిక తండ్రి కాలినడక

 

సాక్షి, వనపర్తి: పోలీసులకు చలాన్లపై ఉన్న మోజు కనీసం విలువలు పాటించడంలో కనిపించదనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ సూచించినా వారి వైఖరి మారడం లేదు. వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామానికి చెందిన సూక్యానాయక్‌ తన కూతురును వనపర్తి మండలం మర్రికుంట కస్తుర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల చేర్పించాడు. కూతురును పాఠశాలలో వదిలేందుకు మంగళవారం ఉదయం తెలిసినవారి వద్దనుంచి బైక్‌ తీసుకెళ్లాడు. మర్రికుంట ఎకో పార్కు వద్ద వాహనాల్ని తనిఖీ చేస్తున్న పోలీసులు.. సూక్యా వాహనాన్ని ఆపి లైసెన్స్, బైక్‌ ఆర్‌సీ తీయమని చెప్పడంతో.. బైక్‌ తనదికాదని.. బండికొనే స్తోమత లేదని.. అందువల్లే లైసెన్స్‌ తీసుకోలేదని చెప్పాడు.



కూతురును స్కూల్లో విడిచివెళ్లేందుకు వచ్చానని చెప్పాడు. లైసెన్స్‌ లేనందున రూ.1,000 జరిమానా కట్టాలని పోలీసులు సూచించారు. తనవద్ద అసలు డబ్బులే లేవని చెప్పడంతో రూ.300 అయినా కట్టాలని, లేనిపక్షంలో బండిని ఇక్కడే ఉంచి వెళ్లాలని హుకుం జారీచేశారు. తనవద్ద రూ.100 కూడా లేవని సూక్యానాయక్‌ బతిమాలినా వినిపించుకోలేదు. దీంతో వనపర్తిలో ఉన్న బంధువుకు ఫోన్‌చేసి రూ.300 ఇవ్వాలని కోరాడు. తాను పనిలో ఉన్నానని వచ్చి తీసుకొని వెళ్లాలని అతడు చెప్పడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తన బంధువు వద్దకు కాలినడకనే వెళ్లాడు. తండ్రి డబ్బులు తీసుకురావడానికి వెళ్లడంతో కూతురు బైక్‌ వద్ద రోడ్డుపక్కనే గంటలకొద్దీ నిల్చుంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top