కన్ను మూస్తే కాటికేనట..!


సాక్షి, ఖమ్మం : ‘బుధవారం అర్థరాత్రి.. సమయం 12 గంటలు. అంతా గాఢనిద్రలో ఉన్నారు.. అప్పుడప్పుడే ఒక్కొక్కరి సెల్‌ఫోన్‌లు మోగుతున్నాయి..ఇంత అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేశారు...?  ఏదైనా వినకూడని వార్త వినాల్సి వస్తుందా..? అంటూ సంశయిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశారు.. అవతలి నుంచి మీరు ఇంకా నిద్రపోతున్నారా.. ఈ విషయం మీకు తెలియదా..? ఫలానా చోట ఆవుకు ఆడ శిశువు జన్మించిందట, ఇంకోచోట ఆవుకు దూడ జన్మించిందట.. ఆ దూడకు మూడు తలలు ఉన్నాయట..!



అది మాట్లాడుతోందట.. !! ఇది అనర్థం... నిద్రపోయే వారు చనిపోతారట.. మరోచోట ఓ మహిళకు ఇద్దరు కవల శిశువులు పుట్టారట.. వారు పుట్టిన వెంటనే మాట్లాడుతూ మేము చనిపోతున్నాం.. పడుకున్న వాళ్లంతా మా వాళ్లు... మేల్కొన్న వారు మీ వాళ్లు అని చెప్పారట’ ఇలా వదంతుల కలకలం జిల్లాను చుట్టుముట్టింది. పడుకుంటే  ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసినట్టేననే పుకార్లు ఒక్కొక్కరికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి.



  ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ శిశువు పుట్టడంతోనే రాఖీ కట్టుకుని పుట్టాడని, ఆ శిశువు వెంటనే చనిపోయిందని, రాఖీ కట్టుకున్న వారు కూడా చనిపోతారన్న వదంతులు ఆ జిల్లాతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా గుప్పుమన్నాయి. దీంతో వేలాదిమంది కట్టుకున్న రాఖీలను విప్పేశారు. ఇది మరువకముందే బుధవారం అర్థరాత్రి ఈ రకమైన వదంతులు జిల్లాలో వ్యాపించాయి. ఒక్కొక్కరి నుంచి మొదలైన ఈ భయాందోళన పదులు, వందలు, వేల సంఖ్యలో ప్రజలను ఆందోళనకు గురి చేసింది. మారుమూల పల్లెలు, తండాలు, గూడేల నుంచి పట్టణాల వరకు అందరిలోనూ కలకలం రేకెత్తించింది.



ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేట.. ఇలా ప్రతిచోటా జనం గుమిగూడి ఏం జరుగుతుందోనని చర్చించుకున్నారు. ఈ విషయం ఫోన్‌లో తమ బంధువు లు, స్నేహితుల ద్వారా తెలుసుకున్న కుటుం బాలు గాఢనిద్రనుంచి మేల్కొని తెల్లవార్లు భయాందోళనలతో గడిపారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు అనర్థమని, వారిని పడుకోనివ్వొద్దని బంధువులు చెబుతుండటంతో పిల్లలున్న వారు వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని ముచ్చట్లు చెబుతూ నిద్రపోకుండా చేశారు. ప్రసార మాద్యమాల్లో ఈ విషయం ఏమైనా వస్తుందేమోనని కొంతమంది ఆతృతగా టీవీలు చూశారు. తెల్లవారుజామున పలు చానళ్లలో ఖమ్మం జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో కూడా ఇలా జాగారం చేస్తున్న విషయాలను ప్రసారం చేయడంతో ఏ ఒక్కరికి నిద్రపట్టలేదు.



 ఇక్కడ ఇలా జరిగిందట...

 బయ్యారంలో ఆవుకు వింత శిశువు జన్మించిందని.. తాను చనిపోతున్నానని... పడుకున్న వాళ్లందరినీ తాను తీసుకెళ్తున్నానని... మేల్కొన్న వారు మీ వాళ్లంటూ చెప్పిందని.. ఇది అనర్థమని, ఎవరూ పడుకోవద్దని పలువురు పక్కవారికి తెలపడంతోపాటు ఆ శిశువును తమ పక్క ఇంటి వారు చూసి వచ్చారని చెప్పడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అలాగే మరికొందరికి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, మిర్యాలగూడెంలో ఓ మహిళకు ఇద్దరు కవలలు పుట్టారని, వారు పుట్టగానే మాట్లాడుతూ తాము చనిపోతున్నామని, పడుకున్న వారిని తమతోపాటే తీసుకెళ్తామని చెప్పారని మరికొందరికి ఫోన్‌లు వచ్చాయి.



 పడుకోవద్దు... పడుకోవద్దు....

 ఈ వదంతులు దావానలంలా వ్యాపించడానికి ప్రధాన కారణం ఒక్క సెల్‌ఫోనే..! మారుమూలన ఉన్న పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి కుటుంబంలో సెల్‌ఫోన్ ఉండటంతో క్షణాల్లోనే వదంతులు వ్యాప్తి చెందాయి.  ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందోనని.. వీరు కూడా మరో పదిమందికి ఫోన్ చేసి ఆరాతీశారు. జిల్లాతోపాటు పక్కన ఉన్న వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, కురవి, నర్సంపేట, నల్గొండ జిల్లా కోదాడ, మిర్యాలగూడెం, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంతాలలోనూ ఈ వదంతులు మార్మోగాయి.



 ఎవరు ఏ ఫోన్ ఎత్తినా కూడా ‘పడుకోవద్దు..ఇలా జరుగుతుందట..జాగ్రత్త’ అని సూచిస్తుండటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొంతమంది అయితే ఏమీ జరగకూడదు... తామంతా క్షేమంగా ఉండాలని తమ ఇష్టదైవాలను ప్రార్థించుకున్నారు. కీడు తొలగిపోతుందనే ఉద్దేశంతో కొంతమంది చిన్నపిల్లలను తడివస్త్రాలతో తుడిచి పడుకోకుండా ఉండేందుకు టీవీల ముందు కూర్చోపెట్టారు. వేలాది మంది తమ బంధువులకు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేయడంతో కొన్ని ప్రాంతాల్లో నెట్ వర్క్ స్తంభించి ఫోన్లు కలవలేదు. దీంతో మరింత ఆందోళనకు గురయ్యారు.



 క్షణమొక యుగంగా....

 వదంతుల వ్యాప్తితో భయంతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రజలు క్షణమొక యుగంగా గడిపారు. ఖమ్మం నగరంలో ఉదయం 5 గంటలకు కరెంటు కోత ఉండటం... జిల్లాలోని మండలాలు, పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా మధ్యమధ్యలో నిలిపివేయడంతో చిమ్మచీకటిలో వణికిపోయారు. ఇల్లందు, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోని తండాల్లో గిరిజనులు తమ ఇళ్లనుంచి బయటకు వచ్చి రోడ్డుపైనే జాగారం చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏదో జరుగుతుంది... ఈ రాత్రి గడిస్తే చాలు అనుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top